బిసి రిజర్వేషన్లు అమలు తర్వాతే స్థానిక ఎన్నికలు జరగాలి. కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ హామీని అమలు పరచాలి
అక్షరవిజేత,వనపర్తి ప్రతినిధి :
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం వెంటనే కార్యాచరణ చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వనపర్తి జిల్లా ప్రధానకార్యదర్శి ముకుంద నాయుడు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరసనలు, ఆమరణ దీక్షలు సైతం చేపడతామని హెచ్చరించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు బీసీ టైగర్ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకై పోరాడతామని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై న్యాయ నిపుణులతో సమావేశం నిర్వహించకపోవడం, అఖిలపక్ష కమిటీ వేసి ఢిల్లీకి తీసుకెళ్లకపోవడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు. సంబంధిత అంశాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టేసి జాప్యం చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చిన హామి మేరకు ఎన్నికలకు వెళ్లాలని దీనిపై త్వరలో హామి నెరవేరేలా సంఘం కార్యాచరణ చేపడతామని తెలిపారు.