వ్యక్తిగత విమర్శలు కాదు.. సమస్యలపై సమాధానమివ్వండి – తిరుపతి యాదవ్
అక్షరవిజేత, హైదరాబాద్ బ్యూరో:
ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో గత కొన్నాళ్ళుగా పాలన పడకేసిందని భాజపా నాయకుడు తిరుపతి యాదవ్ విమర్శించారు. స్థానిక బోయిన్పల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక కార్పొరేటర్ ప్రజల బాగోగులు పట్టించుకోకపోవడంతో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ సమస్యల వలయంలో చిక్కుకున్నట్లు అయన తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించడం చేతకాక 15 ఏళ్లుగా కార్పొరేటర్ గా సుదీర్ఘ అనుభవం ఉన్న కార్పొరేటర్ పూర్తిగా తేలిపోయాడని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ ప్రజలే బాహాటంగా చెబుతున్నట్లు ఆయన తెలిపారు. కార్పొరేటర్ గా విఫలమై ప్రజల ఆదరణ కోల్పోయిన నాయకుడిగా ఆగ్రహానికి లోనై దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న తనను తక్కువ చేసి మాట్లాడడం, దిగజారే విధంగా వ్యవహరించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో తిరుపతి యాదవ్ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ దేశంలోనే అత్యధికంగా సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీగా నిలిచిందని ప్రస్తుతం బారసా పరిస్థితి మునిగే నావ లాగా తయారయిందని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ పార్టీ దయనీయ పరిస్థితికి తోడు డివిజన్లో అభివృద్ధి పనులు జరగక సమస్యలు ఎక్కువకావడంతో కార్పొరేటర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నట్లు పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నోచుకోని పరిస్థితి డివిజన్లో నెలకొందని బిజెపి తరఫున ఈ అంశాన్ని లేవనెత్తడంతో హుటాహుటిన కార్పొరేటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు 100 పడగల ఆసుపత్రికి కేటాయించాలని మేడ్చల్ కలెక్టర్ ను కలవడం బిజెపి విజయానికి తొలి మెట్టని అన్నారు. డివిజన్లోని వివిధ సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని డ్రైనేజీ సమస్యలతో పాటు ఓపెన్ మాన్ హోల్స్, 20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు ఇప్పటికీ కొన్ని కాలనీలలో అలాగే ఉన్నాయని వీళ్ళేమో అభివృద్ధి చేశామని ప్రగల్బాలో పలుకుతూ అవాకులు చివాకులు పేల్చడం సిగ్గుచేటని అన్నారు. కార్పొరేటర్ తన స్థాయికి తగ్గట్టు హుందాగా మాట్లాడి రాజకీయాలలో నైతిక విలువలను పెంచుకుంటే బాగుంటుందని అన్నారు.