పీడిత ప్రజల ముద్దుబిడ్డ, ప్రముఖ మార్చిస్టు- లెనినిస్టు- రైతాంగ -పీడిత ప్రజల నాయకుడు కామ్రేడ్ రాయిని వీరయ్య 25వవర్ధంతి !
ప్రముఖ మార్క్సిస్టు- లెనినిస్టు నాయకుడు, ప్రకాశం జిల్లా గ్రామీణ పేదల సంఘం అధ్యక్షుడు, కామ్రేడ్ రాయిని వీరయ్య గారు 22- 6 -2000 న రైతాంగ సమస్యలపై గుంటూరు పొగాకు బోర్డు కు వచ్చి గుంటూరులో అకస్మాత్తుగా చనిపోయారు. ప్రకాశం జిల్లా జె. పంగులూరు మండలం, చందలూరు గ్రామంలో 1935వ సంవత్సరములో రాయిని కేశవయ్య , రత్తమ్మ దంపతులకు కామ్రేడ్ రాయిని వీరయ్య గారు జన్మించారు. దుద్దుకూరు హైస్కూల్ లో 1956 లో ఎస్.ఎస్. ఎల్. సి వరకు చదివి సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశారు. విద్యార్థిగానే కమ్యూనిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితుడై పీడిత ప్రజా విముక్తికై పోరాడారు. కొద్దికాలం మిలటరీ లో పనిచేసి, దాన్ని విరమించుకొని వచ్చి 1959లో భూలక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు.
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం పొందిన కామ్రేడ్ రాయిని వీరయ్య గారు కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన వివిధ చీలికల్లో సిపిఐ( ఎం.ఎల్) వైపు నిలిచారు. ఆయన అంతిమ శ్వాస విడిచే నాటికి కామ్రేడ్ కొల్లా వెంకయ్య గారి నాయకత్వానగల ఎమ్.ఎల్ కమిటీ( ఆంధ్ర ప్రదేశ్) లో ముఖ్య నాయకులు. మార్క్సిజం- లెనినిజం -మావో ఆలోచనా విధానం వెలుగులో భారతదేశ పీడత ప్రజల విముక్తి, దున్నేవానికి భూమి సాధ్యమని మనసారా నమ్మిన కార్యకర్త ఆయన .కామ్రేడ్ కొల్లా వెంకయ్య గారి నాయకత్వాన మార్క్సిస్టు- లెనినిస్టు పార్టీలను ,గ్రూపులను ఐక్యం చేయుట కొరకు జరిపిన కృషిలో కామ్రేడ్ షేక్ బుడే, దేవతోటి నాగయ్య, కొల్లిపర వెంకటేశ్వరరావు, దామా చెంచయ్య, ఈదుల వెంకయ్య, దాసరి అంకమ్మ ,అత్తోటి పీటర్ మొదలగు కామ్రేడ్స్ తో కలిసి పని చేసిన వారిలో రాయిని వీరయ్య ప్రముఖులు .
నిరంతరం ప్రజల సమస్యలను అధ్యయనం చేస్తూ వాటి పరిష్కారానికై వివిధ గ్రామాలకు వెళ్లి, నిరంతరం ప్రజలను చైతన్యం చేస్తూ పోరాట ఆందోళనలు రూపు దిద్దిటంలో ఆయన ముందుండేవారు. 1980లో ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలలో గ్రామీణ పేదల సంఘ నిర్మాణానికి అమరుడు కామ్రేడ్ కొల్లా వెంకయ్య గారి నాయకత్వాన్ని నడుం కట్టారు.వ్యవసాయ విప్లవం ,దున్నేవానికి భూమి లక్ష్య సాధనలో వివిధ గ్రామాలకు వెళ్లి బంజరు, సీలింగు, దేవాదాయ, ధర్మాదాయ భూములపై పేద ప్రజలను కదిలించి పోరాట ఆందోళనలు రూపుదిద్దటంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు.
ప్రకాశం జిల్లాలో చెందలూరు కోనంకి, కొనికి, జె.పంగులూరు, సంతరావూరు, బయట మంజులూరు, కొండ మంజులూరు, ఇనగల్లు తదితర గ్రామాల్లోనూ గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, కొండపాటూరు, ఈతేరు, రేటూరు కొప్పుకొండ ,అగ్నిగుండాల తదితర గ్రామాల్లో పేదలకు భూములు దఖలుపరచడంలో మాత్రమే కాకుండా ఆయా గ్రామాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుకు విశేష కృషి చేసి సాగునీరును ఆ భూములకు వచ్చేందుకు పోరాడారు .వివిధ గ్రామాల్లో ఇల్లులేని నిరుపేదలకు నివేశ స్థలాల కొరకు నాయకత్వం వహించి పోరాడారు. చందలూరు వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా కృషి చేశారు. 1975-77 ఎమర్జెన్సీ కాలంలో రహస్య జీవితం గడుపుతూ వివిధ గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
విద్యార్థి దశ నుండి చందలూరు పరిసర గ్రామాలలో వ్యవసాయ రైతు, కూలీలకు అండగా ఉండి కూలి రేట్ల పెంపు కొరకు ,బంజరు మీనా, కుంట ,పోరంబోకు, మాన్యం భూములు పేద ప్రజలకు చెందాలని సంఘాలను ఏర్పాటు చేసి పోరాటాల ద్వారా అనేక విజయాలు సాధించారు. చందలూరులో అంటరానితనం, సాంఘిక దురాచారులకు వ్యతిరేకంగా భూ పోరాటాలలో కీలక పాత్ర పోహి పోషించి రిజిస్టర్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీని అన్ని కులాల పేదవారితో 1969లో సంఘంగా స్థాపించారు. ఆ సంఘ స్థాపనలో కామ్రేడ్ వీరయ్య గారు కీలకపాత్ర పోషించాడు. ఒక వైపు సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలతో మమేకమై ఆదర్శవంతంగా జీవించారు. చందలూరు గ్రామాన్ని కమ్యూనిస్టు ఉద్యమానికి కేంద్రంగా ఉంచటం లో కామ్రేడ్ వీరయ్య గారు విశేష కృషి చేశారు. రైతాంగ సమస్యలపై వివిధ ఆందోళనలు నిర్వహించారు. సాగరు ముంపు సమస్యలపై పనిచేశారు.
అమరజీవి ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ కొల్లా వెంకయ్య గారితో కలిసి మార్క్సిజం- లెనినిజం- మావో ఆలోచనా విధానం వెలుగులో కమ్యూనిస్టు విప్లవకారుల సూత్రబద్ధమైన ఐక్యత కొరకు కృషి చేశారు. బ్లడ్ షుగర్ ,బీపీ,అనారోగ్యం ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నప్పటికీ వాటిని సైతం లెక్కచేయక దృఢమైన విప్లవ దీక్షతో ,పట్టుదలతో విప్లవోద్యమంలో వివిధ బాధ్యత నిర్వహిస్తూ అమరులైనారు. 2000 సంవత్సరం జూన్ నెల 22వ తేదీన పొగాకు రైతాంగ సమస్యలపై జరుగుతున్న ఆందోళనలో భాగస్వామిగా గుంటూరు టుబాకో బోర్డు కు వచ్చి అమరులైన ఆ కామ్రేడ్ చూపిన విప్లవదీక్ష , పట్టుదల తోటి కార్యకర్తలు, ఆచరణలో చూసిన పేద ప్రజానీకం ప్రజలు మరువలేరు. కామ్రేడ్ రాయిని వీరయ్య గారి స్మారకార్థం పేద ప్రజలు చందలూరు గ్రామ నడిబొడ్డున స్మారక స్థూపం నిర్మించుకున్నారు.
జోహార్ కామ్రేడ్ రాయిని వీరయ్య గారు.
ఇట్లు,
రాయిని వీరయ్య గారికి విప్లవ జోహార్లతో,
మన్నవ హరిప్రసాద్, పోలిట్ బ్యూరో సభ్యుడు, సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్.
82477 28296
mannavahariprasad@gmail.com.