విద్యా... వ్యాపారమా..? ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడి
అక్షర విజేత మరిపెడ :
ఇంగ్లీషు విూడియంపై మోజు, కార్పొరేటు స్కూళ్లపై వ్యామోహంతో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లల్లో చేర్పిస్తున్నారు. ఖర్చు ఎంతైనా పర్లేదు? తమ బిడ్డల భవిష్యత్ బాగుండాలని ఆరాటపడుతున్నారు. ఎన్ని కష్టాలు భరించైనా సరే యాజమాన్యాలు నిర్ణయించిన ఫీజులను చెల్లిస్తున్నారు.ఇక ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల సంగతి చూస్తే నిర్ణయించిన ఫీజు కంటే ఒక్క రూపాయి కూడా తక్కువ తీసుకునే పరిస్థితి ఉండదు. తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్య పూర్తిగా వ్యాపారంగా మారిపోయింది. చదువుకునే రోజులు పోయి, చదువు కొనుక్కొనే రోజులు వచ్చాయి. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు పేదవాడి శ్రమ దోపిడీగా మారింది. ఈ పోటీ ప్రపంచంలో పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చేసిన తపన, ప్రైవేట్ విద్యాసంస్థలకి లాభ మార్గంగా మారింది. చదువు పేరుతో డబ్బుల దోపిడీకి తెరలేపారు.
పుస్తకాలు, నోట్ బుక్స్ పై 'ఊబరితనం'
పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆ పాఠశాల నుంచే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ కొనాల్సిందేనని పాఠశాల యాజమాన్యం గట్టి నిబంధనలు విధిస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలల్లో పుస్తకాల విక్రయం నిషేధం. అయినప్పటికీ కొందరు టీచర్లు, పార్ట్నర్ల ద్వారా అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
విద్యాశాఖ ‘పర్యవేక్షణ’ ఎక్కడ?
మరిపెడ మండలముతో పాటు చుట్టూ పక్కల గ్రామాల నుంచి విద్యార్థులు స్కూల్ వ్యాన్లు, ప్రైవేట్ వాహనాల్లో తరలివస్తున్నారు. వీరంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి విద్య అందిస్తున్న ఈ సమయంలో, ప్రైవేట్ విద్యాసంస్థలు మోసపూరితంగా వ్యవహరిస్తుండటం ఆందోళనకరం. విద్యాశాఖ అధికారులు కళ్ళు మూసుకుని ఉండటంతో ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.