రాష్ట్రంలో కబ్జాకు గురైన ఆలయ భూములను స్వాధీనం చేసుకోవాలి ---దేవాదాయ, రెవెన్యూ శాఖల అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి. --ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర అధ్యక
అక్షర విజేత ములుగు ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల ఆలయ భూములు కబ్జాదారుల చేతిలోకి వెళ్లిపోయాయని, వాటిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వాల కాలంలో రాష్ట్రంలోని కొన్నిచోట్ల ఆలయ భూములను కొంతమంది అధికారులు, కబ్జాదారులు కలిసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూ అక్రమణలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. ఇట్టి భూములలో ప్రభుత్వంలోని కొంతమంది అధికారుల, రాజకీయ నాయకుల అండదండలతో అక్రమ కట్టడాలు, నిర్మాణాలు కూడా జరిగాయని ఇంకా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. దేవదాయ శాఖ అధికారులు, రెవిన్యూ శాఖ అధికారులు ఇట్టి భూములపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమాల చిట్టాను బయటపెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 1956 త్రీసాల్ సేత్వార్ ప్రకారం ఆలయ భూముల లెక్క పర్ఫెక్ట్ ఉన్నదని వాటిని బయటికి తీసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నదని ఆయన అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 33 జిల్లా కమిటీల నుండి ఈ సమాచారం తీసుకుని త్వరలో ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు ఆయన తెలిపారు. దేవాలయ భూముల పరిరక్షణపై అన్ని జిల్లా కమిటీల ఆధ్వర్యంలో త్వరలో కార్యచరణ కూడా ప్రకటిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పాక శ్రీనివాస్ యాదవ్, నగేష్, గ్రేటర్ వరంగల్ ఎన్నికల ఇన్చార్జి కోమాండ్ల శ్రీనివాస్, గీసుకొండ మండల అధ్యక్షులు చంటి తదితరులు పాల్గొన్నారు.