*పేదల సొంతింటి కల సాకారం... ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితాశయం : ప్రత్తిపాటి*
పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్షర విజేత
• పట్టణంలోని 207 పేద కుటుంబాలకు గృహ మంజూరు పత్రాలు అందించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. : ప్రత్తిపాటి.
• జనవరి నాటికి నియోజకవర్గంలో 1148 ఇళ్లను పేదలకు అందించబోతున్నాం : ప్రత్తిపాటి.
• గత పాలకులు పేదల జీవితాశయంతో వ్యాపారం చేసి తమ ఖజానా నింపుకున్నారు : ప్రత్తిపాటి
• కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తైతే జిల్లాలో 11,200 పూర్తయ్యాయి : కలెక్టర్ కృతికా శుక్లా
• కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి అర్హులైన పేదకుటుంబాలకు ఇంటి నిర్మాణ పత్రాలు అందించిన మాజీమంత్రి ప్రత్తిపాటి.
అందరికీ ఇళ్లు అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని, పేదల సొంతింటి కలను సాకారం చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ఆయన జీవితాశయమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి పట్టణంలోని 207 పేద కుటుంబాలకు బుధవారం ఆయన ఇంటి నిర్మాణ మంజూరు పత్రాలను అందించారు. ఒక కుటుంబంతో కలిసి కొత్తగానిర్మించిన ఇంట్లోకి గృహ ప్రవేశం చేసిన ప్రత్తిపాటి.. కలెక్టర్ తో కలిసి ఆ ఇంట్లో దీపం వెలిగించి, లబ్ధిదారుల్ని సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి, కలెక్టర్ కృతికా శుక్లా ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు.
*జనవరి నాటికి పేదలకు 1148 ఇళ్లు అందిస్తాం..*
పేదల సొంతింటి కలని కూటమిప్రభుత్వం కేవలం 17నెలల్లో నిజం చేసిందని, నేడు రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల గృహప్రవేశాలు జరగడం దేశమే గర్వించాల్సిన అంశమని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు.
పట్టణంలోని 207 కుటుంబాలకు ఇంటి నిర్మాణ పత్రాలు అందించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని, ఇళ్లను సకాలంలో నిర్మించి నివాసముంటేనే ప్రభుత్వలక్ష్యం నెరవేరుతుందన్నారు. జనవరినాటికి నియోజకవర్గంలో మరో 1148 ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి పేదకుటుంబాలకు అందించాలనే బృహత్తర లక్ష్యంతో ఉన్నట్టు ప్రత్తిపాటి చెప్పారు. సొంతస్థలంలో ఇళ్లు నిర్మించుకునేవారికి కూటమి ప్రభుత్వం రూ.2.50 లక్షల వరకు అందిస్తోందని, ఆసొమ్ము లబ్ధిదారులు తిరిగి చెల్లించే పనిలేదన్నారు. అలానే ఇంటినిర్మాణానికి అవసరమైన ఇసుకను ప్రభుత్వమే అందిస్తోందని, ఉచిత ఇసుక విధానంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణరంగం కూడా బలోపేతమవుతుందన్నారు. స్థలం లేనివారికి ప్రభుత్వం త్వరలోనే ఉచితంగా స్థలాలు మంజూరు చేయనుందని, పట్టణాల్లోని పేదలకు 2 సెంట్లు, గ్రామీణప్రాంతాల్లోని వారికి 3 సెంట్ల ఉచిత స్థలం అందిస్తుందని ప్రత్తిపాటి తెలిపారు. పేదల గృహసముదాయాల్లో నిరంతర విద్యుత్, తాగునీరు, అన్నిరకాల మౌలిక వసతుల కల్పనకు కూటమిప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇళ్ల లబ్ధిదారులు తమకు కేటాయించిన నివాసాల్లో హాయిగా జీవించవచ్చని ప్రత్తిపాటి చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమపథకాలు అందడంతో పాటు.. సకాలంలో వారి సొంతింటి కలలు నిజమవుతున్నాయని ప్రత్తిపాటి చెప్పారు.
*పేదల జీవితాశయంతో వ్యాపారం చేసి, తమ ఖజానా నింపుకున్న ఘనులు వైసీపీనేతలు*
పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన అవినీతి మంత్రి అంతులేని అవినీతికి పాల్పడ్డారని, వారి జీవితాశయంతో వ్యాపారం చేసి తమ ఖజానా నింపుకున్నారని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నివాసానికి పనికిరాని స్థలాలిచ్చి పేదల జీవితాలతో ఆటలాడి, తమ జేబులు నింపుకున్న ఘనత వైసీపీనేతలకు దక్కుతుందన్నారు.
*పేదలు తమకు మంజూరైన ఇళ్లనిర్మాణం పూర్తిచేస్తేనే మరలా ఇళ్లు కేటాయిస్తారు: కలెక్టర్*
ప్రభుత్వం తమకు కేటాయించిన ఇళ్లను లబ్ధిదారులు సకాలంలో వెంటనే నిర్మించుకోవాలని, నాణ్యమైన నిర్మాణ సామగ్రిని వినియోగించి ఇళ్లు నిర్మించుకుంటేనే ప్రభుత్వాలు అందించే ఆర్థికసాయం సకాలంలో అందుతుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రతి కుటుంబం తమకు మంజూరు చేసిన ఇళ్లను త్వరగా పూర్తిచేస్తేనే, మరలా అర్హులైన వారికి ప్రభుత్వాల నుంచి ఇళ్లు కేటాయింపు జరుగుతుందన్నారు. నేడు పండుగ వాతావరణంలో ముఖ్యమంత్రి 3 లక్షల సామూహిక గృహప్రవేశాలు జరిపించారని, ఆ క్రమంలో పల్నాడు జిల్లాలో కూటమిప్రభుత్వం వచ్చాక 11,200 ఇళ్లనిర్మాణం పూర్తైందని, చిలకలూరిపేట నియోజకవర్గంలో 1418 పూర్తయినట్టు కలెక్టర్ వివరించారు. మొంథా తుపాన్ ప్రభావం నుంచి ప్రజల్ని కాపాడటంలో యంత్రాంగం, ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందని కలెక్టర్ తెలిపారు. గతంలో ఇక్కడ జాయింట్ కలెక్టర్ గా పనిచేశానని, అప్పటికీ, ఇప్పటికీ అభివృద్ధిలో జిల్లాలో, నియోజకవర్గంలో చాలా మంచి మార్పు వచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధులత, జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి బాబు, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, నెల్లూరి రంజిత్, మున్సిపల్ కౌన్సిలర్లు, టీడీపీ ముఖ్య నాయకులు, డి.ఈ అబ్దుల్ రహీమ్, హౌసింగ్ బోర్డు పిడి బండారు శివలింగం, ఏఈ విజయ్ కుమార్, , ఏఈ లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.