*భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* *జిల్లా ఎస్పీ కే. నారాయణ రెడ్డి*
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు వాటి కారణంగా ఏర్పడిన వరద నీటి ప్రవాహ పరిస్థితిని జిల్లా ఎస్పీ కే. నారాయణ రెడ్డి బుధవారం క్షుణ్ణంగా సమీక్షించారు. రాబోయే రోజుల్లో కూడా మరింతగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, జిల్లా ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఈ సందర్భంగా సూచించారు.
*పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశాలు*
జిల్లా ఎస్పీ కే. నారాయణ రెడ్డి మాట్లాడుతూ, పోలీస్ అధికారులు వెంటనే తమతమ పోలీస్ స్టేషన్ల పరిధిలోని వాగులు, కుంటలు, చెరువులలోని వరద నీటి ప్రవాహంపై నిరంతరం దృష్టి పెట్టాలని ఆదేశించారు. మరింత పటిష్టంగా బందోబస్త్ నిర్వహించాలని, ముందస్తు జాగ్రత్త చర్యలను పటిష్టం చేయాలని సూచించారు. ముఖ్యంగా, రాకపోకలకు ఆటంకం కలిగించేలా పొంగిపొర్లుతున్న వాగులు,నాళాల దగ్గర రోడ్డులను బ్లాక్ చేయాలని ఆదేశించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పోలీస్ అధికారులు ఇతర శాఖల అధికారులు, గ్రామాల పెద్దలతో కలసి సమన్వయంతో పని చేయాలని కోరారు. బందోబస్త్ విధులలో పాల్గొనే సిబ్బంది, అధికారులు తప్పకుండా రెయిన్ కోట్లను వినియోగించి, తగు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ తెలిపారు.
*జిల్లా ప్రజలకు ముఖ్య సూచనలు*
అనంతరం ఎస్పీ జిల్లా ప్రజలకు కొన్ని కీలకమైన సూచనలు చేశారు.
ప్రజలు ఎవ్వరూ కూడా నీటి ప్రవాహం వేగంగా వెళ్తున్న వాగులను, కాలువలను, రోడ్డులను దాటే ప్రయత్నం చేయవద్దు. సంయమనం పాటించి, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి.
పాతబడిన ఇండ్లు శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఎవ్వరూ కూడా ఉండవద్దు. ప్రమాదాలు జరగకుండా తక్షణమే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అన్నారు.
వర్షాకాలానికి సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఎవరికైనా ఏదైనా అత్యవసరం ఉండి, పోలీస్ సహాయం అవసరమైతే, వెంటనే ఆయా పోలీస్ స్టేషన్స్ అధికారులకు గాని, డైల్ 100 కి గాని, లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712670056 కు గాని కాల్ చేయాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు.
ప్రజలందరూ సహకరించి, సురక్షితంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.