మహాభారతంలో: రాజనీతి శాస్త్రం"
"మహాభారతంలో: రాజనీతి శాస్త్రం"
మహాభారతం కేవలం ఒక ఇతిహాసం మాత్రమే కాదు. అది భారతీయ సంస్కృతి, ధర్మం, రాజకీయాలకు సంబంధించిన జ్ఞాన సముద్రం. వ్యాస మహర్షి రచించిన ఈ మహా కావ్యంలో, ముఖ్యంగా శాంతి పర్వంలో, భీష్ముడు యుధిష్ఠిరుడికి (ధర్మరాజు కు) రాజధర్మం గురించి ఉపదేశిస్తాడు. ఇది రాజుకు ఉండాల్సిన లక్షణాలు, రాజ్య వ్యవస్థ,రాజ్య పాలన , రాజ ధర్మం, యుద్ధ నీతి, పన్నుల విధానం(పొలిటికల్ ఎకానమీ) వంటి రాజకీయ శాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలను వివరిస్తుంది. ఈ అంశాలు పురాతనమైనవి అయినప్పటికీ, ఆధునిక రాజకీయ వ్యవస్థలకు కూడా ప్రేరణగా నిలుస్తాయి. అయితే, వీటిని విశ్లేషించి చూస్తే, ఆదర్శవాదం - వాస్తవికత మధ్య సంఘర్షణ కనిపిస్తుంది. ఇది మహాభారతాన్ని మరింత ఆసక్తికరంగా చేస్తుంది.
రాజుకు ఉండాల్సిన లక్షణాలు:
---------
మహాభారతంలో రాజుకు ఉండాల్సిన లక్షణాలను గుర్తించి విస్తృతంగా చర్చ కనిపిస్తుంది. రాజు విద్యావంతుడు, ధైర్యవంతుడు, జ్ఞానవంతుడు అయి ఉండాలి. అతను సత్యవంతుడు, విశ్వాసయోగ్యుడు, ధర్మపరుడు, సమానత్వం కలిగినవాడు అయి ఉండాలి. భీష్ముడు యుధిష్ఠిరుడికి చెప్పినట్లుగా, రాజు తన ప్రజలను తల్లి లాగా ప్రేమించాలి, తండ్రి లాగా రక్షించాలి, గురువు లాగా మార్గదర్శకత్వం చేయాలి. అతను కోపాన్ని నియంత్రించాలి, శత్రువుల భావాలను, బలహీనతలను అర్థం చేసుకోవాలి, నిర్ణయాలు త్వరగా తీసుకోవాలి. ఇవి ఆదర్శ లక్షణాలు అయినప్పటికీ, విమర్శనాత్మకంగా చూస్తే, మహాభారత యుద్ధంలో ధృతరాష్ట్రుడు లాంటి రాజులు ఈ లక్షణాలు లేకుండా పాలించారు, ఇది రాజకీయ అస్థిరతకు దారితీసింది. ఆధునిక సమాజంలో కూడా, నాయకులు ఈ లక్షణాలు కలిగి ఉండకపోతే, రాజకీయ సంక్షోభాలు తలెత్తుతాయి.
రాజ ధర్మం :
--------
మహాభారతంలో రాజు ధర్మం కేంద్ర బిందువు. రాజు ధర్మాన్ని రక్షించాలి, ప్రజల సంక్షేమాన్ని కాపాడాలి. అతను పాపాలను (చెడు పనులను) నిర్మూలించాలి, న్యాయాన్ని స్థాపించాలి. భీష్ముడు చెప్పినట్లుగా, రాజు ప్రజల రక్షణకు మాత్రమే ఉండాలి. వ్యక్తిగత లాభాలకు కాదు. ఇది ధర్మ, అర్థ, కామలను సమతుల్యం చేస్తుంది. అయితే, విశ్లేషణాత్మకంగా, ఈ ధర్మం క్షత్రియులకు మాత్రమే పరిమితమై ఉండటం వర్ణ వ్యవస్థను ప్రతిబింబిస్తుంది. ఇది సమకాలీన సమానత్వ భావనలకు విరుద్ధం. మహాభారత యుద్ధంలో ధర్మం పేరుతో అధర్మాలు జరిగాయి, ఇది ధర్మం యొక్క సాపేక్షతను ప్రశ్నిస్తుంది.
రాజ్య వ్యవస్థ, రాజ్యం పాలన :
--------
మహాభారతంలో సప్తాంగ రాజ్యంగా వివరించబడింది. ఇది రాజు, మంత్రి, కోశం, దండం, మిత్రం, రాష్ట్రం, నగరం అనే ఏడు అంగాలను కలిగి ఉంటుంది. రాజు మంత్రులను నియమించాలి, వారు సమర్థులు, నమ్మదగినవారు అయి ఉండాలి. మండలంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఉండాలి. పాలనలో గూఢచారులు ముఖ్యం. శత్రువులను పర్యవేక్షించాలి, వారిపై ఎప్పుడూ నిఘా ఉంచాలి. గ్రామాలు, నగరాలు నిర్వహణకు గ్రామికులు, నగరాధీషులు ఉండాలి. ఇది మంచి పాలనకు ఉదాహరణ, కానీ విమర్శనాత్మకంగా, ఇది రాజతంత్రాన్ని ప్రోత్సహిస్తుంది, గణతంత్రాలు (సంఘాలు) ఉన్నప్పటికీ వాటిని బలహీనంగా చూపిస్తుంది. ఆధునిక లోకతంత్రంలో, ఈ వ్యవస్థ సమానత్వం లేకుండా కనిపిస్తుంది.
యుద్ధ నీతి :
--------
మహాభారతంలో యుద్ధాన్ని ధర్మ యుద్ధంగా నిర్వచించబడింది. యుద్ధం సూర్యోదయం నుండి అస్తమయం వరకు మాత్రమే జరగాలి. ఒకే యోధుడిపై బహుళ యోధులు దాడి చేయకూడదు. నిరాయుధులు, గాయపడినవారు, భయపడి పారిపోయేవారి పై, మహిళలు, బ్రాహ్మణులు, పిల్లలపై దాడి చేయకూడదు. రాత్రి యుద్ధాలు, మోసాలు నిషేధం. అయితే, మహాభారత యుద్ధంలో ఈ నియమాలు ఉల్లంఘించబడ్డాయి. అభిమన్యుడి హత్య, అశ్వత్థామ రాత్రి దాడి వంటివి. ఇది యుద్ధంలో ధర్మం ఆచరణీయం కాదని సూచిస్తుంది. విశ్లేషణాత్మకంగా, ఇది ఆధునిక అంతర్జాతీయ మానవతా చట్టాలకు సమానం. కానీ, యుద్ధంలో శక్తి (బలం ప్రదర్శన, కుయుక్తులు ధర్మాన్ని మించిపోతుందని చూపిస్తుంది.యుద్ధంలో గెలవడమే అంతిమ లక్ష్యం , గెలుపు కోసం కొన్ని అధర్మం పద్ధతులు అనివార్యం.
పన్నుల విధానం:
---------
మహాభారతంలో న్యాయబద్ధంగా పన్నులు వసూలు చేయాలని వివరించబడింది. రాజు ప్రజల ఆదాయంలో ఆరవ వంతు మాత్రమే పన్నుగా వసూలు చేయాలి. అది మధురసం లాగా సేకరించాలి. అంటే ప్రజలకు భారం కాకుండా. దోషాలకు జరిమానాలు (పెనాల్టీ), వ్యాపారుల నుండి రక్షణకు రుసుములు, విదేశీ వ్యాపారం లో సహేతుకమైన సుంకాలు ( టారిఫ్) విధించాలి. బ్రాహ్మణులు, స్రోత్రియులకు పన్నుల నుండి మినహాయింపు ఇవ్వాలి. అతిగా పన్నులు విధిస్తే రాజు ద్వేషానికి గురవుతాడు. ఇది సమానత్వం, సుస్థిరతను ప్రోత్సహిస్తుంది.
విమర్శనాత్మకంగా చూస్తే ...ఇది ఆధునిక ప్రగతిశీల పన్ను వ్యవస్థలకు సమానం. కానీ వర్ణ ఆధారిత మినహాయింపులు అసమానతను సూచిస్తాయి. మహాభారతంలో ప్రజలు రాజుకు పన్నులు చెల్లించకపోతే పాపాలు పంచుకుంటాడు. ఇది పౌరుల బాధ్యతను నొక్కి చెప్తుంది.
విదేశాంగ విధానం:
--------
ఇతర రాజ్యాల రాజకీయ అంశాలలో, మహాభారతం షడ్గుణ విదేశాంగ విధానాన్ని చర్చిస్తుంది – సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైధీభావ, సంశ్రయ. ఇది రాజకీయ వ్యూహాలకు ఉదాహరణ. గూఢచార్యం రాజు కళ్ళుగా పనిచేస్తుంది. అయితే, ఇది అరాచకాన్ని (అనార్కీని )ఖండిస్తుంది, రాజు లేకుండా రాజ్యం భయానకమని చెప్తుంది. విశ్లేషణాత్మకంగా, మహాభారతం రాజకీయ శాస్త్రాన్ని ధర్మ ఆధారితంగా చూపిస్తుంది, కానీ యుద్ధంలో ధర్మ ఉల్లంఘనలు వాస్తవికతను బయటపెడతాయి. ఇది ఆదర్శవాదం అలాగే రాజకీయ శక్తి కి మధ్య సమతుల్యాన్ని సూచిస్తుంది. రాజకీయ సిద్ధాంతాలకు- ఆచరణకు కొంత బేధం ఉంటుంది.చివరిగా... మహాభారత రాజకీయ బోధనలు ఆధునిక ప్రపంచంలో కూడా సందర్భోచితంగా ఉన్నాయి. నాయకులు ధర్మాన్ని మరచి పాలిస్తే, సమాజం అరాచకంలో పడుతుంది. అయితే, వర్ణ వ్యవస్థ, రాజతంత్రం వంటివి సమకాలీన సమానత్వ, లోకతంత్ర భావనలకు సవాలు వంటివని. మహాభారతం మనకు నిరంతరం గుర్తుచేస్తుంది: రాజకీయంలో ధర్మం లేకుండా శక్తి (బలం ప్రదర్శన) మాత్రమే ప్రధానం అయితే, అది వినాశనానికి దారితీస్తుంది. ఈ ఇతిహాసం అధునాతన రాజకీయ శాస్త్రానికి శాశ్వతమైన విలువల విషయంలో మార్గదర్శకంగా నిలిచాయి.
* డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్. 9849328496.