తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టినం అని పార్టీ పేరు మార్చిన్రు?"* - కవిత సంచలన వ్యాఖ్యలు
*తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టినం అని పార్టీ పేరు మార్చిన్రు?"*
- కవిత సంచలన వ్యాఖ్యలు!
అక్షరవిజేత, ఎడిటర్ డా.బి,అనిల్ కుమార్ హైదరాబాద్ :
గులాబీ గూటిలో ముసలం పుట్టిందా? పార్టీ అధిష్టానం నిర్ణయాలనే సొంత కూతురు మరియు పార్టీ నేతలు తప్పుపడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత సోమవారం మండలిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీ పేరు మార్పుపై ఆమె చేసిన ఘాటు విమర్శలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాకుండా, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
*ఏం పీకి కట్టలు కట్టామని..?*
ఒకప్పుడు ఉద్యమ పార్టీగా వెలుగొందిన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడంపై కవిత అసహనం వ్యక్తం చేశారు. "తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టామని పార్టీ పేరు మార్చారు అధ్యక్షా?" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నేరుగా అధిష్టానం నిర్ణయాన్ని ప్రశ్నించినట్లుగా ఉన్నాయి. జాతీయ రాజకీయాల పేరుతో తెలంగాణ అస్థిత్వాన్ని పక్కన పెట్టడం వల్లే పార్టీ ఈరోజు ఈ పరిస్థితిలో ఉందనే అర్థం వచ్చేలా ఆమె మాట్లాడటం గమనార్హం.
*వైరల్ అవుతున్న వీడియో.. కలవరంలో గులాబీ శ్రేణులు!*
మండలి సమావేశంలో సంభాషణలో భాగంగా వచ్చిన ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు అవాక్కయ్యాయి. అసలే అధికారం కోల్పోయి కష్టకాలంలో ఉన్న పార్టీకి, కేసీఆర్ సొంత కూతురే ఇలాంటి విమర్శలు చేయడం పెద్ద దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
*ప్రశ్నార్థకమైన జాతీయ వ్యూహం*
కేసీఆర్ తీసుకున్న జాతీయ పార్టీ నిర్ణయం తప్పని కవిత పరోక్షంగా అంగీకరించినట్లయింది.తెలంగాణ సెంటిమెంట్ పార్టీ పేరు మార్చడం వల్ల తెలంగాణ ప్రజలతో ఉన్న పేగు బంధం తెగిపోయిందన్న భావన ఆమె మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.ఈ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు.. "చివరికి ఇంట్లో వాళ్లే ఒప్పుకుంటున్నారు, బీఆర్ఎస్ ఒక విఫల ప్రయోగం" అని ఎద్దేవా చేస్తున్నారు.
*డ్యామేజ్ కంట్రోల్ సాధ్యమేనా?*
ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో పార్టీ వర్గాల్లో కలకలం మొదలైంది. ఇది ఆమె వ్యక్తిగత అభిప్రాయమా లేక పార్టీలో చాలా కాలంగా ఉన్న అసంతృప్తికి ప్రతిరూపమా అనేది తేలాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఈ వ్యాఖ్యలు పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.