నూతన సంవత్సరంలో ‘నామినేటెడ్’ జాతర – రెండేళ్ల నిరీక్షణకు శుభం కార్డు
నూతన సంవత్సరంలో ‘నామినేటెడ్’ జాతర
– రెండేళ్ల నిరీక్షణకు శుభం కార్డు
అక్షరవిజేత ఎడిటర్ డా.బి,అనిల్ కుమార్/హైదరాబాద్:
తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త ఏడాది సరికొత్త సందడిని మోసుకొస్తోంది. ప్రభుత్వం ఏర్పాటై రెండు ఏళ్లు గడుస్తున్న తరుణంలో, నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావాహుల నిరీక్షణకు తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లు, బోర్డులు, కమిటీల్లో ఖాళీగా ఉన్న వందలాది పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ‘నామినేటెడ్ జాతర’తో ద్వితీయ శ్రేణి నాయకత్వంలో నూతనోత్సాహం నింపడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి.
*నిరీక్షణకు లభించనున్న ప్రతిఫలం*
గత ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులు చాలా కాలంగా పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో పాలనపై దృష్టి సారించడం, ఆపై ఆర్థిక సమీకరణల వల్ల నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆలస్యమవుతూ వచ్చింది. అయితే, నూతన సంవత్సర కానుకగా ఈ పెండింగ్ ఫైళ్లకు మోక్షం కల్పించాలని అధిష్టానం నిర్ణయించింది.
*భర్తీ కానున్న కీలక పోస్టులు ఇవే..*
రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పే కీలక కార్పొరేషన్లతో పాటు జిల్లా స్థాయి కమిటీలను కూడా ఈ దఫా భర్తీ చేయనున్నారు.రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు లో సివిల్ సప్లైస్, ఆర్టీసీ, హౌసింగ్ బోర్డ్, పారిశ్రామికాభివృద్ధి సంస్థ , పర్యాటక అభివృద్ధి సంస్థ వంటి కీలక పదవులు.
దేవాలయ కమిటీలో భాగంగా యాదాద్రి, వేములవాడ వంటి ప్రముఖ ఆలయాల ట్రస్ట్ బోర్డుల నియామకం.జిల్లా స్థాయిలో గ్రంథాలయ సంస్థలు, మార్కెట్ కమిటీలు మరియు డీసీసీబీ పాలక మండళ్లు వంటి పదవులు దక్కనున్నాయి.
*సామాజిక సమీకరణాలే ప్రామాణికం*
ఈ నియామకాల్లో కేవలం విధేయతకే కాకుండా సామాజిక సమీకరణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు సముచిత స్థానం కల్పించడం ద్వారా రాబోయే ఎంపీటీసీ , జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో మైలేజ్ పొందాలనేది వ్యూహం. మహిళా కోటాకు కూడా పెద్దపీట వేయనున్నట్లు సమాచారం.పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికి గుర్తింపు దక్కే సమయం వచ్చింది. ఇది కేవలం పదవుల పంపిణీ మాత్రమే కాదు, ప్రజలకు సేవ చేసే బాధ్యతను అప్పగించడం కూడా అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
*ఆశావాహుల్లో పెరిగిన ఉత్కంఠ*
ఏడాది ముగుస్తున్న తరుణంలో జిల్లాల వారీగా జాబితాలు ఇప్పటికే సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. గాంధీ భవన్ నుంచి ప్రగతి భవన్ వరకు అభ్యర్థుల పైరవీలు, సిఫార్సుల హోరు పెరిగింది. ఎవరికి ఏ పదవి దక్కుతుందో అన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది. మొత్తానికి ఈ నూతన సంవత్సరం తెలంగాణలో రాజకీయ నియామకాలతో సందడిగా గడవనుంది.