తెలుగు నేలపై 'శ్రమ' నిశ్శబ్దం.. పరాయి గడ్డపై 'సిరి' ప్రవాహం!* – తెలుగు రాష్ట్రాలకు 'పని'గండం – పరాయి రాష్ట్రాల చేతుల్లో కీలక రంగాలు! – ఉచితాలకు అలవా
*తెలుగు నేలపై 'శ్రమ' నిశ్శబ్దం.. పరాయి గడ్డపై 'సిరి' ప్రవాహం!*
– తెలుగు రాష్ట్రాలకు 'పని'గండం
– పరాయి రాష్ట్రాల చేతుల్లో కీలక రంగాలు!
– ఉచితాలకు అలవాటుపడి వృత్తిని వదులుకుంటున్న తెలుగోడు..
– జెండాల మోతలో.. వృత్తి పనుల కోత!
– పని మనది.. ఫలితం వారిది
– తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న ఉపాధి ముఖచిత్రం.
– ఉచితాల మత్తులో ఊగుతున్న యువత..
– ఉపాధి వేటలో పొరుగు రాష్ట్రాల జేత!
– వృత్తిని వదిలి.. వ్యసనానికి బానిసై.. దివాలా దిశగా తెలుగోడు!
– పొరుగు రాష్ట్రాల శ్రమజీవుల రాజ్యంగా ఏపీ, తెలంగాణ!
అక్షరవిజేత ఎడిటర్ డా.బి,అనిల్ కుమార్/హైదరాబాద్/అమరావతి -
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో పెను సంక్షోభం పొంచి ఉందా? అవుననే అంటున్నారు సామాజిక, ఆర్థిక నిపుణులు. ఒకప్పుడు శ్రమకు మారుపేరుగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 'పని చేసే చేతులు' కరువవుతున్నాయి. వ్యవసాయం నుంచి ఐటీ వరకు, టీ కొట్టు నుంచి టైల్స్ పనుల వరకు.. రంగం ఏదైనా పరాయి రాష్ట్రాల వ్యక్తులే కనిపిస్తున్నారు. సొంత గడ్డపై ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నా, స్థానిక యువత వ్యసనాలకు, రాజకీయాలకు మరియు ఉచిత పథకాలకు బానిసలై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది.
*మన పనులు.. వారి చేతుల్లో*
రాష్ట్రంలో ఏ చిన్న పని కావాలన్నా ఇప్పుడు ఉత్తరాది వారిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాల వారీగా ఇక్కడి మార్కెట్‌ను వారు ఎలా శాసిస్తున్నారో చూడండి.
???? ఇటుక బట్టీల నుండి వ్యవసాయ పనుల వరకు (వరి నాట్లు, పత్తి ఏరడం) అంతా బీహార్ వాసులు వీరిదే హవా.
???? టీ స్టాళ్లు, హోటళ్లు, హార్డ్‌వేర్ మరియు శానిటరీ షాపుల నిర్వహణలో రాజస్థాన్ వాసులు వీరు అగ్రస్థానంలో ఉన్నారు.
???? టైల్స్ వేయడం, పెయింటింగ్, ఇంటీరియర్ డెకరేషన్ వంటి నైపుణ్యం కలిగిన పనుల్లో ఉత్తరప్రదేశ్ వాసులు వీరు పాతుకుపోయారు.
???? హోటల్ వంటకాలు మరియు భవన నిర్మాణ రంగంలో ఒరిస్సా,కర్ణాటక , ఉత్తర ప్రదేశ్ వాసులు వీరు వెన్నెముకగా మారారు.
???? ప్రైవేట్ పాఠశాలల్లో ఆంగ్ల బోధనలో కేరళ వాసులు వీరిదే పైచేయి.
*వ్యసనాల ఉచ్చులో స్థానిక యువత*
మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లోని శ్రమశక్తి దారి తప్పుతోంది. ఉచిత పథకాల ద్వారా వచ్చే సొమ్ముతో కాలక్షేపం చేస్తూ, ఏ పార్టీ ఎక్కువ డబ్బులిస్తే ఆ జెండా పట్టుకుని తిరుగుతూ విలువైన కాలాన్ని వృధా చేసుకుంటున్నారు.మందు, మాంసం మరియు తక్షణ ప్రయోజనాల కోసం వ్యసనాల ఉచ్చులో పడి స్వంత వృత్తులను వదులుకుంటున్నారు.కష్టపడే స్వభావం క్రమంగా నశిస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో పని చేద్దామన్నా చేవలేని పరిస్థితి, నైపుణ్యం లేని స్థితి ఏర్పడే ప్రమాదం ఉంది.
*ఆర్థిక సంక్షోభానికి అడుగుజాడలు*
మన రాష్ట్రంలో సంపాదించిన సంపద అంతా పొరుగు రాష్ట్రాలకు తరలిపోతోంది. స్థానికులు కేవలం 'వినియోగదారులు'గా మిగిలిపోతుంటే, ఇతర రాష్ట్రాల వారు 'నిర్వాహకులు'గా ఎదుగుతున్నారు. నిపుణుల హెచ్చరికల ప్రకారం.. ఇదే ధోరణి కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక అసమానతలు పెరిగి, స్థానికులు తమ సొంత గడ్డపైనే కూలీలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది."తక్షణమే మేల్కోకపోతే, సంపద తరలిపోవడమే కాకుండా.. మన తదుపరి తరాలు పని దొరకక దివాలా తీసే స్థితికి చేరుకుంటారని.ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.నేటి యువత ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది! వృత్తిని గౌరవిద్దాం - శ్రమతో మన సంపదను మనమే కాపాడుకుందాం.
*సంపద తరలిపోతోన్న గణాంకాల విశ్లేషణ*
తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికుల సంఖ్య మరియు ఆర్థిక లావాదేవీల అంచనా ప్రకారం
భవన నిర్మాణం రంగంలో ఇతర రాష్ట్రాల వాటా 70 శాతం – 80 శాతం ఉండగా సగటున నెలకు తరలిపోతున్న ఆదాయం (అంచనా) రూ.1,500 కోట్లు గా ఉంది. అదే వ్యవసాయం (కూలీలు) రంగం చూసుకుంటే ఇతర రాష్ట్రాల వాటా 40 శాతం - 50 శాతం ఉండగా సగటున నెలకు తరలిపోతున్న ఆదాయం (అంచనా) రూ.800 కోట్లు
గా ఉంది.హోటల్ & టీ స్టాళ్లు రంగం ను పరిశీలిస్తే ఇతర రాష్ట్రాల వాటా 60 శాతం ఉండగా సగటున నెలకు తరలిపోతున్న ఆదాయం (అంచనా) రూ.500 కోట్లు గా ఉంది. ఇక ఇంటీరియర్ & పెయింటింగ్ రంగంను పరిశీలిస్తే ఇతర రాష్ట్రాల వాటా 90 శాతం ఉండగా సగటున నెలకు తరలిపోతున్న ఆదాయం (అంచనా) రూ.400 కోట్లు గా ఉంది. అంటే ఒక నెలలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల్లోకి వెళ్లి చేరుతున్న ఆదాయం సుమారు 3,200 కోట్లు సంపద తరలిపోతుంది.ప్రతి నెలా వేల కోట్ల రూపాయల నగదు 'శ్రమ రూపంలో' ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. మన దగ్గర డబ్బు ఉన్నా, అది మన రాష్ట్ర ఆర్థిక చక్రంలో తిరగడం లేదు. ఫలితంగా స్థానిక వ్యాపారాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
*తెలుగు బిడ్డా.. మేల్కో!"*
పని దొరకడం లేదు అనడం అబద్ధం.. పని చేయడం ఇష్టం లేదనడం నిజం!ఒకప్పుడు మన తాతలు, తండ్రులు ఎండనక, వాననక కష్టపడి ఈ నేలను సస్యశ్యామలం చేశారు. కానీ నేడు.. చేతిలో స్మార్ట్ ఫోన్, జేబులో పార్టీ ఇచ్చే వంద రూపాయలు, సాయంత్రం అయితే మందు బాటిల్.. ఇదేనా మన యువత లక్ష్యం?
నీ ఇంటికి టైల్స్ వేయడానికి ఉత్తరప్రదేశ్ వాడు రావాలా?
నీ పొలంలో నాట్లు వేయడానికి బీహార్ వాడు రావాలా?
చివరికి నీకు టీ కలిపి ఇవ్వడానికి కూడా రాజస్థాన్ వాడు రావాలా?
మనం 'గౌరవం' పేరుతో శ్రమను వదిలేస్తున్నాం. కానీ వారు శ్రమను నమ్ముకుని మన గడ్డపై యజమానులవుతున్నారు. మనం ఇలాగే ఉచితాలకు ఆశపడి సోమరిపోతులము అయితే, రాబోయే పదేళ్లలో మన పిల్లలు మన సొంత ఊర్లోనే పరాయి వాళ్ల దగ్గర కూలీలుగా చేరాల్సిన దుస్థితి వస్తుంది.గుర్తుంచుకో కష్టపడే తత్వమే మనిషికి నిజమైన ఆస్తి. ఉచితాలు ఈ రోజు కడుపు నింపుతాయి, కానీ రేపటి తరాల భవిష్యత్తును చిదిమేస్తాయి.
కేవలం చదువు ఉంటే సరిపోదు, చేతి వృత్తుల పట్ల గౌరవం పెరగాలి. పని ఏదైనా మన రాష్ట్ర సంపద ఇక్కడే ఉండేలా యువత నడుం బిగించాలి. "శ్రమ ఏవ జయతే"అన్న నినాదాన్ని నిరూపించాలి."మీ ఓటును, మీ సమయాన్ని అమ్మేసుకుంటున్నారు సరే.. కానీ మీ పిల్లల భవిష్యత్తును కూడా అమ్మేస్తారా? శ్రమ సంస్కృతిని కాపాడుకుందాం.. తెలుగు జాతి గౌరవాన్ని నిలబెడదాం!"