సంతాన సాఫల్య కేంద్రాలలో అవకతవకలు*
*సంతాన సాఫల్య కేంద్రాలలో అవకతవకలు*
అక్షరవిజేత, ప్రత్యేక ప్రతినిధి సి.హెచ్. ప్రతాప్ :
ఇటీవలి కాలంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడులు వంటి కారణాల వల్ల ఈ సమస్య తీవ్రంగా మారుతోంది. దీని పరిష్కారంగా చాలామంది ఫెర్టిలిటీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. జీవితంలో ఒక ఆశను నెరవేర్చుకునేందుకు తమ పొదుపు సొమ్మునే ఖర్చు చేస్తూ ఈ కేంద్రాలను ఆశ్రయిస్తున్న దంపతులకు కొందరు వ్యాపారదారుల వ్యవహారం తీవ్ర నిరాశను కలిగిస్తోంది.ప్రైవేటు సంతాన సాఫల్య కేంద్రాలలో అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం, మితిమీరిన చార్జీలు వసూలు చేయడం, నైతికతలేని చికిత్సలు అందించడం గమనార్హం. విద్యార్థినుల నుంచి అనుమతి లేకుండానే అండాలను సేకరించడం, హార్మోన్ మందుల ద్వారా ఆరోగ్యాన్ని దెబ్బతీయడం వంటి చర్యలు అసహ్యంగా మారాయి. కొన్నిచోట్ల జీవకణాలను వాణిజ్య వస్తువులుగా మార్చి మధ్యవర్తుల ద్వారా గోప్యంగా విక్రయించడం జరుగుతోంది.ఇలాంటి వ్యవహారాల్లో చికిత్సలు ఫలించకపోతే బాధితులకు పూర్తి సమాచారం ఇవ్వకుండా, సమస్యను వారి వ్యక్తిగత వైఫల్యంగా మలచి పంపించేస్తున్నారు. ఇది బాధాకరం. పర్యవేక్షణ సంస్థలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందున ఈ కేంద్రాలకు అడ్డు లేకుండా ప్రవర్తించే స్వేచ్ఛ దొరకుతోంది.ఇప్పటికే కొన్ని ప్రైవేటు కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా గ్రామీణ వైద్యులు, ఫార్మసీల సిబ్బందితో కలిసి జీవకణాల విక్రయం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఐయూఐ, ఐవీఎఫ్ పేర్లతో నిర్వహించే చికిత్సలు, అవి ఎలా పనిచేస్తాయన్న విషయాలపై చాలామంది దంపతులకు అవగాహన లేదు. కొంతమంది దంపతుల నుంచి మొదటివారిసార్లు జీవకణాలు తీసుకున్నట్టు చెప్పి, మూడవసారికి మాత్రం మరిచిపోయేలా చేసి, ఇతర దాతల జీవకణాలతో గర్భధారణ కలిగిస్తున్నారు. ఇది డిఎన్ఏ పరీక్షలో మాత్రమే బయటపడుతోంది. ఇటీవలి కాలంలో సికింద్రాబాద్లోని ఓ కేంద్రంపై ఇదే తరహా కేసు నమోదైంది.ఈ తరహా అక్రమాలు కేవలం వైద్య నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు – మానవ విలువలను క్షీణింపజేస్తున్నవని బయో నైతికత నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళల శరీర భాగాలను వస్తువులుగా చూపడం, పేదరికాన్ని వాడుకొని వారిని కమర్షియల్ సరోగసీకి వాడుకోవడం మానవత్వాన్ని మసకబారుస్తోంది. ఇది మహిళల ఆత్మగౌరవాన్ని దిగజార్చే చర్య. ప్రేమ, త్యాగం, బంధం వంటి విలువలు ఈ వాణిజ్య ధోరణుల్లో కనుమరుగైపోతున్నాయి.ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిస్వార్థంగా (పారితోషికం లేకుండా) చేసే సరోగసీకి మాత్రమే అనుమతి ఇచ్చింది. ధనానికి ముడిపడి జరిగే సరోగసీకి నిషేధం విధించింది. దీనివల్ల మానవీయ విలువలకు గౌరవం చేకూరుతుంది. ఇది సమాజ శ్రేయస్సు దిశగా మంచి అడుగుగా భావించవచ్చు.కాబట్టి ప్రతి సంతాన సాఫల్య కేంద్రం ప్రభుత్వ అనుమతితో, స్పష్టమైన నిబంధనల ఆధారంగా నడవాలి. అర్హతలున్న వైద్యులు, అనుభవజ్ఞులైన సిబ్బంది మాత్రమే వ్యవహరించాలి. బాధితులకు పారదర్శకంగా సమాచారం ఇవ్వాలి. సర్రోగేట్గా పనిచేసే మహిళలపై ఎలాంటి ఒత్తిడిని కూడా సహించరాదు.జిల్లా స్థాయిలో ప్రభుత్వ IVF కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ సేవలు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తాయి. ప్రైవేటు దోపిడికి అడ్డుకట్ట వేయవచ్చు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పదమైన కేంద్రాల గురించి ఆరోగ్యశాఖకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వడంలో మొహమాటపడకూడదు.సంతానలేమి ఒక వ్యక్తిగత బాధ మాత్రమే కాదు – అది సమాజంలో మనుగడలో ఉన్న మానవతా విలువలపై ప్రశ్నలు వేస్తున్న సంకేతం. ఈ రంగంలో నైతికత, నిబంధనలు, పారదర్శకత, ప్రభుత్వ పర్యవేక్షణలు తప్పనిసరి. బాధితులకు న్యాయం, మహిళలకు గౌరవం, సమాజానికి మార్గదర్శనం అందించాలంటే ఈ చర్యలు అత్యవసరం.