మందు బాబులకు అడ్డా @ యర్రబాలెం అపర కర్మల భవనం
*మందు బాబులకు అడ్డా @ యర్రబాలెం అపర కర్మల భవనం*
*-తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలి*
*-మృతుల బంధువుల నిద్ర గదిగా వినియోగం లోకి తీసుకు రావాలి.*
*చెరువు కమిటీ సహకరిస్తే సరి...లేకుంటే దాతల సహకారంతో పూర్తి చేయాలనే యోచనలో ఆఖరి మజిలీల అభివృద్ధి కమిటీ*
*అక్షర విజేత యర్రబాలెం:*
మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం లోని అపర కర్మల భవనం మద్యం బాబులకు అడ్డాగా మారింది. మృతుల బంధువులు అపర కర్మలు నిర్వహించుకుంటారనే సదుద్దేశ్యంతో గత కొన్నేళ్ల క్రితం చెరువు పక్కనే అపర కర్మల భవనాన్ని నిర్మించారు. మృతుల వారసులు గుండ్లు గీయించుకోవడం, వారసులు గడ్డాలు, మీసాలు గీయించుకుని స్నానాలు ఆచరించడంతో పాటు భర్త చనిపోయిన వివాహిత మహిళల గాజు, పూసలు తీయించే కత్రువును అపర కర్మల భవనంలోనే నిర్వహించేవారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది గత కొన్నేళ్లుగా హిందూ స్మశానవాటిక లోనే అపర కర్మలకు సంబంధించిన కత్రువు ను నిర్వహిస్తుండటంతో అపర కర్మల భవనం నిరుపయోగంగా మారింది. రాత్రి వేళల్లో మద్యం బాబులు అపర కర్మల భవనం వద్దకు చేరుకుని మద్యం సేవిస్తోన్నారు. ఒక్కోసారి మద్యం మత్తులో సీసాలను సైతం ఆవరణలోనే పగులగొడుతున్నారు. అపర కర్మల భవనం ఆవరణలోని బావిలో మద్యం బాబులు ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలు పడవేయడంతో నీరు సైతం కలుషితమయంగా మారాయి. అపర కర్మల భవనం వెంబడి వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.
*అపర కర్మల భవనాన్ని తాత్కాలికంగా వినియోగంలోకి తీసుకు రావాలి.*
*- అద్దె ఇంట్లో ఉంటూ మృతి చెందిన కుటుంబ సభ్యులు నిద్ర చేసే గదిగా వినియోగిస్తే సరి*
కాగా యర్రబాలెం చెరువు ఆవరణలోని ఖాళీ స్థలంలో కాల క్రమేణా అలంకార ప్రాయంగా మారి మందు బాబులకు ఆవాసంగా తయారైన అపర కర్మల భవనాన్ని తాత్కాలికంగా వినియోగంలోకి తీసుకు రావాలని పలువురు స్థానిక ప్రజలు కోరుతున్నారు. అద్దె ఇంట్లో ఉండి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు నిద్ర చేసేందుకు వీలుగా మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకువస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.
*చెరువు కమిటీ సహకరించాలి....*
కాగా గత కొన్నేళ్లుగా నిరుపయోగంగా మారిన అపర కర్మల భవన తాత్కాలిక మరమ్మతులకు చెరువు కమిటీ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి గత కొన్ని దశాబ్దాలుగా చెరువులో చేపలు పెంచుకునే హక్కుకు బహిరంగ వేలం పాటల ద్వారా వచ్చిన ఆదాయం, చెరువులో గడ్డి వేలం పాట, చివరకు గేదెల పేడ పోగు చేసుకునేందుకు సైతం వేలం పాటలు నిర్వహించి ఆదాయాన్ని ఒనగూర్చుకున్నారు. నిర్ణీత కాలం ప్రకారం ఆ నాటి నుంచి ఎన్నో కమిటీలు మారాయే తప్ప గ్రామ అభివృద్దికి మాత్రం అంతగా సహకరించలేదనే వాదనలు లేకపోలేదు. పాత పంచాయతీ భవనాన్ని తొలగించి మూడు గదులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. అందులో ఒక గదిని చెరువు కమిటీ కార్యాలయంగా కేటాయించి మిగిలిన రెండు గదులను బహిరంగ వేలం పాట నిర్వహించి అద్దెలకు ఇచ్చారు. అంతకు కొన్నేళ్ల ముందు పాత పంచాయతీ స్థలం ఆవరణలోనే రేకుల షెడ్లు తో మూడు గదులను నిర్మించి బహిరంగ వేలం పాటలు నిర్వహించి అద్దెలను క్రమం తప్పకుండా ప్రతినెలా వసూలు చేస్తున్నారు. వచ్చే ఆదాయంతో పాత పంచాయతీ భవన స్థలంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ పై అంతస్తు నిర్మించి గ్రంథాలయాన్ని సైతం నిర్మిస్తామని చెబుతూనే వచ్చారే కానీ...ఆ మేరకు కార్యాచరణ చేపట్టలేకపోయారనే విమర్శలు లేకపోలేదు. కాల వ్యవధి ప్రకారం చెరువు అభివృద్ధి కమిటీ సభ్యులు మారుతున్నారే తప్ప వారి అవినీతికి మాత్రం అడ్డూ అదుపూ లేకుండా పోతోందనే వాదనలు లేకపోలేదు. చెరువు కమిటీ ఎన్నిక సైతం మైకు ప్రచారం ద్వారా బహిరంగ పర్చకుండా కేవలం కొందరి హక్కుగా భావించుకుంటూ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇప్పటికైనా ప్రస్తుత చెరువు కమిటీ గ్రామ అభివృద్దికి సహకరించేలా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా పాత పంచాయతీ ఆవరణలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ పై అంతస్తులో గ్రంథాలయాన్ని నిర్మించడంతో పాటు నిరుపయోగం మారిన అపర కర్మల భవనానికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి మృతుల బంధువుల నిద్ర గదిగా వినియోగం లోకి తీసుకు రావాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.
*ఆఖరి మజిలీల అభివృద్ధి కమిటీ సహకారం...*
కాగా చెరువు కమిటీ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులకు ఆఖరి మజిలీల అభివృద్ధి కమిటీ తరపునా సహకరించేందుకు సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే గత మూడున్నర సంవత్సరాలుగా ఆఖరి మజిలీల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన రెండు ఏసీ మార్చురీ బాక్సులతో పాటు అంతిమయాత్ర ఆటో సేవలు సైతం నిరంతరాయంగా కొనసాగుతోన్నాయి. ఈ నేపథ్యంలో అద్దె ఇంటి మృతుల బంధువులు నిద్ర చేసేందుకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నిరుపయోగంగా ఉన్న అపర కర్మల భవనాన్ని తాత్కాలికంగా మరమ్మతులు చేయించాలని నిర్ణయించారు. అయితే నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ గారు నవులూరు, యర్రబాలెం , కృష్ణాయ పాలెం గ్రామ ప్రజల సౌకర్యార్థం అధునాతన స్మశాన వాటిక నిర్మాణ యోచనలో ఉన్నట్లు కొందరు స్థానిక పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే అప్పటి వరకైనా మందుబాబులకు అడ్డాగా మారిన అపర కర్మల భవనానికి తాత్కాలిక మరమ్మతులు చేయిస్తే ఈ లోగా ఎవరైనా అద్దె ఇంట్లో చనిపోయిన మృతుల బంధువులు నిద్ర చేసేందుకు ఇబ్బంది పడకుండా ఉంటారన్నదే ఆఖరి మజిలీల అభివృద్ధి కమిటీ యోచనగా ఉంది. ఇప్పటికే ముగ్గురు దాతలు సైతం తమ వంతు విరాళాలను కమిటీకి అందజేశారు. చెరువు కమిటీ ముందుకు వస్తే దాతలు అందించిన విరాళాలను సైతం అప్పగించడంతో పాటు నిర్మాణానికి సహకరించేందుకు సిద్దమని ఆఖరి మజిలీ అభివృద్ధి కమిటీ సభ్యులు చెబుతోన్నారు. ఒకవేళ చెరువు కమిటీ సభ్యులు ముందుకు రాకుంటే ఆఖరి మజీల అభివృద్ధి కమిటీకి సహకరిస్తే తామే దాతల సహకారంతో తాత్కాలికంగా అపరకర్మల భవనానికి మరమ్మతులు చేయించేందుకు సిద్ధమని కూడా అంటున్నారు