పావలాఅనుమతులు-ముప్పావలా తవ్వకాలు* * కొండను మింగేస్తున్న బకాసురులు * ఉప్పలచిలుకలో 'కొండంత దోపిడీ?
*పావలాఅనుమతులు-ముప్పావలా తవ్వకాలు*
* కొండను మింగేస్తున్న బకాసురులు
* ఉప్పలచిలుకలో 'కొండంత దోపిడీ?
* రైతుల పొలాలు నాశనం
* లబోదిబోమంటున్న రైతులు
* అనుమతులు కాగితాలకే పరిమితం..
* వెనుక ఎవరి అండదండలు?
*విజేత, సత్తుపల్లి.*
ప్రకృతి ప్రసాదించిన సంపద కొందరు మైనింగ్ మాఫియా స్వార్ధానికి బలైపోతోంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఉప్పలచిలుక గ్రామ పరిసరాల్లో సాగుతున్న కంకర రాయి తవ్వకాలు ఇప్పుడు పెను వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. అనుమతులు ఒకచోట.. తవ్వకాలు మరోచోట అన్నట్లుగా సాగుతున్న ఈ వ్యవహారంపై స్థానికులు మండిపడుతున్నారు.
*నియమ నిబంధనలు గాలికి..*
ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వారీ నిర్వహణకు నిర్దిష్టమైన లోతు, విస్తీర్ణం మరియు రోజువారీ ఉత్పత్తి పరిమితులు ఉంటాయి. కానీ, ఉప్పలచిలుకలో క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
*అడ్డూఅదుపు లేని తవ్వకాలు*
చరానా అనుమతులు పొంది బారానా సొమ్ము చేసుకుంటున్నారు.అనుమతి పొందిన విస్తీర్ణాన్ని దాటి పక్కనే ఉన్న ప్రభుత్వ భూముల్లోకి, గుట్టల్లోకి తవ్వకాలు విస్తరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
*పర్యావరణ విధ్వంసం*
భారీ పేలుళ్లు, నిరంతరం తిరిగే లారీల వల్ల వెలువడే ధూళితో సమీపంలోని పంట పొలాలు దెబ్బతింటున్నాయి. అంతేకాకుండా, లోతైన తవ్వకాల వల్ల భూగర్భజలమట్టం పడిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దుమ్ము ధూళి వలన పంటలు దెబ్బ తింటున్నాయి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గాలిలో కలుషితం ఔతున్న దుమ్ము ధూళి కణాలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు పెను శాపంగా మారాయి.కలుషితమైన గాలిని పీల్చడం వల్ల లివర్ ఇన్ఫెక్షన్లు జలుబు దగ్గు తదితర వ్యాధులకు గురై వయస్సు పైబడిన వృద్దులు మరణించడం కూడా జరుగుతుంది.
*అధికార యంత్రాంగం మౌనం.. వెనుక మర్మమేమిటి?*
సాధారణంగా ఇలాంటి భారీ తవ్వకాలు జరిగినప్పుడు మైనింగ్, పర్యావరణ శాఖలు నిరంతరం పర్యవేక్షించాలి. కానీ ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది.మైనింగ్ శాఖ ( డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ జియాలజీ ) వాస్తవంగా ఎంత రాయి తరలిపోతోంది? ఎంత రాయల్టీ ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు? అనే అంశాలపై స్పష్టత లేదు.
*కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్పీ సిబి )*
కంకర మిల్లులు వల్ల వచ్చే పొల్యూషన్ ను నిలుపుదల చేయాలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఢిల్లీ వారికి ఫిర్యాదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ కంకర మిల్లులు విడుదల చేసే దుమ్ము ధూళి,దువ్వ ఎగిసిపడి చుట్టుపక్కల వాతావరణం కలుషితం అయ్యి ప్రజలు వింత రోగాలకు గురౌతున్నారు.దుమ్ము ధూళి కణాలు వ్యాపించి ప్రజలకు రకరకాల వైరస్ లు, రోగాలు వ్యాప్తి చెంది ప్రజలు ఆసుపత్రిపాలౌతున్నారు.పచ్చని చెట్లు నశించి పోతున్నాయి.వాతావరణం కలుషితం కావడం వల్ల పంట పొలాలు దిగుబడి తగ్గింది.రైతులు తీవ్రంగానష్టపోతున్నారు.పర్యావరణం దెబ్బతింటుంది.ధూళి కాలుష్యంపై స్థానికులు మొరపెట్టుకున్నా తనిఖీలు నామమాత్రంగానే సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
*రాజకీయ ఆశ్రయం*
అధికారుల మౌనం వెనుక బలమైన రాజకీయ శక్తుల హస్తం ఉందనే అనుమానాలు గ్రామస్తుల్లో బలంగా ఉన్నాయి. "అధికార అండ లేకుండా ఇంత బహిరంగంగా నిబంధనల ఉల్లంఘన సాధ్యం కాదు" అని స్థానికులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.ఈ వ్యవహారంలో పారదర్శకత లోపించడం ప్రధాన సమస్య. అధికారులు తక్షణమే స్పందించి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది: అసలు లీజుకు ఇచ్చిన విస్తీర్ణం ఎన్ని ఎకరాలు?
ప్రస్తుతం తవ్వుతున్నది ఎంత?
సెట్ అవుట్ ( సెట్ అవుట్ ) నిబంధనలుపాటిస్తున్నారా?
పర్యావరణ అనుమతి ( ఈసీ ) పత్రాల్లో పేర్కొన్న నిబంధనలు అమలులో ఉన్నాయా?
అటవీ ప్రాతం కావటం తో అటవీ శాఖ అనుమతులు వున్నాయా?
కొండలు కేవలం రాళ్ల కుప్పలు కావు అవి స్థానిక పర్యావరణ వ్యవస్థకు పట్టుగొమ్మలు, ఉప్పలచిలుకలో జరుగుతున్న ఈ 'కొండల కొల్లగొట్టింపు'పై సమగ్ర విచారణ జరపకపోతే, భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు మైనింగ్ ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు..