డాక్టర్ బాలకృష్ణయ్య మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం..!!! డాక్టర్ బాలకృష్ణయ్య 50 ఏళ్ల నిస్వార్థ వైద్య సేవలు...!!! స్వాతంత్ర్య సమరయోధుడు - సంఘ సంస్క
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
ప్రజా వైధ్యుడు, ప్రజల మనిషి : డా.బాలకృష్ణయ్య
కొన్ని జీవితాలు కాలరేఖపై చెరగని ముద్ర వేస్తాయి. డాక్టర్ బాలకృష్ణయ్య అలాంటి మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆయన కేవలం వైద్యుడిగా మాత్రమే కాదు, స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, అలుపెరుగని ప్రజా నాయకుడిగా, సుదీర్ఘ కాలం పాటు నిస్వార్థ సేవ చేసి వనపర్తి చరిత్రను ‘డాక్టర్ బాలకృష్ణయ్య శకం’గా మార్చి, అపారమైన ప్రజాభిమానాన్ని చూరగొన్నారు.వనపర్తి తాలూకాలో తొలి ఎమ్‌బిబిఎస్ డాక్టర్ బాలకృష్ణయ్య 1924 నవంబర్ 15న వనపర్తి పట్టణంలో శ్రీ మహాదేవయ్య, శ్రీమతి సంజమ్మ దంపతులకు జన్మించారు. వారి ప్రాథమిక విద్యాభ్యాసం వనపర్తిలోనే సాగింది. ఉన్నత చదువులకై హైదరాబాద్‌కు వెళ్లి, సిటీ కాలేజీలో ఎఫ్ఎ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1955లో ఎమ్‌బిబిఎస్ పట్టా పొందారు. వనపర్తి తాలూకాలో మొట్టమొదటి ఎమ్‌బిబిఎస్ డాక్టర్‌గా ఆయన పేరు చరిత్రలో నిలిచింది. విద్యార్థి దశ నుంచే సమాజంపై, ముఖ్యంగా పేద వర్గాలపై విద్య ప్రభావం ఎంతటిదో గుర్తించి, తన సాటి బీద విద్యార్థులకు సాయంకాలం పాఠాలు చెప్పేవారు. స్వాతంత్ర్య సమరయోధుడు - సంఘ సంస్కర్త
నిజాం నిరంకుశ పాలన, ఫ్యూడల్ వ్యవస్థ కొనసాగుతున్న రోజుల్లోనే బాలకృష్ణయ్య ని మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి ప్రముఖుల స్ఫూర్తి ప్రభావితం చేసింది. దీంతో ఆయన స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు.
నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని మొదలుపెట్టి, వనపర్తి కమాన్ వద్ద జాతీయ జెండాను ఎగుర వేశారు. 1947 ఆగస్టు 15న వనపర్తిలోని వేణుగోపాలస్వామి ఆలయ ఆవరణలో జాతీయ జెండా ఎగురవేసినందుకు నాలుగు నెలల జైలు శిక్ష అనుభవించారు.
సంఘ సంస్కర్తగా ఆయన సేవలు అనిర్వచనీయం. ఆయన సోషలిస్టు భావజాలాన్ని నమ్మి, అన్ని వర్గాల ప్రజల్లో ఐక్యమత్యాన్ని పెంపొందించడానికి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. కులమతాలకు అతీతంగా, హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించిన గొప్ప సంస్కర్తగా చరిత్రలో నిలిచారు. పైసా ఫీజు తీసుకోకుండా వైద్య సేవలు ప్రారంభించారు. కేవలం వనపర్తికే పరిమితం కాకుండా, యావత్ పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్యం అందించారు. ఎలాంటి పరీక్షలు లేకుండా, తన అనుభవం, "హస్తవాసి"తోనే ఎంతటి తీవ్రమైన రోగానైనా నయం చేయగల నైపుణ్యం ఆయన సొంతం. ఎందరో డాక్టర్లు నయం చేయలేని రోగాలను తన వైద్యంతో నయం చేసి, కొన్ని లక్షల మందికి ప్రాణభిక్ష పెట్టిన అపర ధన్వంతరిగా ఆయన కీర్తి పొందారు. వైద్య వృత్తిలో ఆయన ఆచరించిన కొత్త పద్ధతి నేటికీ ఆదర్శప్రాయమే: “రోగి వైద్యుని వద్దకు కాకుండా, వైద్యుడు రోగి వద్దకే వెళ్ళాలి.” ఈ నినాదాన్ని ఆచరిస్తూ, రోగులు ఆసుపత్రిలో వేచి ఉండటం అనే పద్ధతికి స్వస్తి పలికి, వైద్యుడై తానే స్వయంగా రోగుల ఇళ్లకు వెళ్లి సేవ చేశారు. శస్త్ర చికిత్స అవసరమైన నిరుపేద రోగులను స్వయంగా హైదరాబాద్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించారు.ఆపదలో ఉన్నప్పుడు, తనను చంపడానికి కుట్ర పన్నిన ప్రత్యర్థి కుటుంబ సభ్యులకు సైతం వైద్యం చేసి, వృత్తి ధర్మాన్ని, మానవతా విలువలను చాటిచెప్పారు.
మున్సిపల్ చైర్మన్‌గా వనపర్తి పట్టణాభివృద్ధికి సారథి
డాక్టర్ బాలకృష్ణయ్య 1957లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించి, రాచరికపు పెత్తనాన్ని ఎదుర్కొన్నారు. 1962లో “పట్టణాభివృద్ధి సమితి”ని స్థాపించి, పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి పట్టణాభివృద్ధికి శ్రీకారం చుట్టారు. మొత్తం 15 వార్డుల్లో విజయం సాధించడం, రాచరిక వ్యవస్థపై సాధించిన తొలి చారిత్రక విజయంగా నమోదైంది.పట్టణాభివృద్ధి సమితి తరపున మున్సిపల్ చైర్మన్ గా , గ్రామ సర్పంచ్ గా రెండు దశబ్దాల పాటు కొనసాగి ఆయన వనపర్తి పట్టణాభివృద్ధికి ఎంతో కృషి చేశారు: వనపర్తి పట్టణానికి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడానికి పలు ఉద్యమాలను, నిరాహారదీక్షలను చేపట్టి ప్రభుత్వంపై వత్తిడి తెస్తూ 1966 నాటికి పట్టణానికి విద్యుత్ వెలుగులు తీసుకొచ్చారు.
మహిళల నీటి కష్టాలను గమనించి, మంచినీటిని పైప్‌లైన్ ద్వారా సరఫరా చేయడానికి పథకాన్ని రూపొందించి, అమలు చేయించారు. ఈ చర్యలు వనపర్తి ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచాయి.ఎమ్మెల్యేగా విద్యాపర్తి రూపశిల్పి
1982లో ఎన్టీఆర్ ఆహ్వానంతో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన, 1983, 1985లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజా సేవలో శిఖరాన్ని చేరుకున్నారు. ఆయన చేసిన అతిపెద్ద అభివృద్ధి పని, ప్రైవేట్ యాజమాన్యం నుండి ఆర్.ఎల్.డి. డిగ్రీ కళాశాలను 1984లో ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం.విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలల ను హైస్కూల్ స్థాయికి పెంచారు. మండల వ్యవస్థ ఏర్పడిన తరువాత, మండలానికొకటి చొప్పున జూనియర్ కళాశాలలలతో పాటు మహిళా డిగ్రీ కళాశాలసాధించి మహిళా విద్యా వ్యాప్తికి కృషి చేసారు. “అంజ్మన్ తర్ఖి”కి అధ్యక్షులుగా కొనసాగుతూ ఉర్దూ మీడియం పాఠశాలలను ఏర్పాటు చేసారు. నెలకొల్పారు. ఈ సుదీర్ఘ కృషి ఫలితంగానే నేడు వనపర్తికి 'విద్యాపర్తి' గా విశిష్ట గుర్తింపు లభించింది.డా.బాలకృష్ణయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా, ఆర్టీసీ డివిజన్ చైర్మన్ గా, శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుని గా పదవులు నిర్వహించి కొన్ని వేల మంది నిరుపేద నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు.సాహితీ పోషణ - అంతర్జాతీయ దృష్టి
డాక్టర్ బాలకృష్ణయ్య ప్రియుడు. ముఖ్యంగా మహాకవి శ్రీశ్రీ సాహిత్యం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. 1974లో శ్రీశ్రీతో పాటు ప్రముఖ కవులైన వరవరరావు, జ్వాలాముఖి వంటి విప్లవ కవులతో వనపర్తిలో కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. 1982లో శ్రీశ్రీ ఇల్లు వేలంపాటకు గురవుతుండగా తెలుసుకుని, దాదాపు పదివేల మందితో సన్మాన కార్యక్రమం నిర్వహించి విరాళాలు సేకరించి రూ.25 వేల చెక్కును అందజేసి, మహాకవిని ఆదుకున్నారు. కష్టకాలంలో వనపర్తి ప్రజలు చూపిన ఈ సహృదయ సన్మానం 'నోబుల్ బహుమతికన్నా గొప్పది' అని శ్రీశ్రీ ఆనాడు పేర్కొన్నారు. అంతర్జాతీయ సంబంధాల పట్ల ఆసక్తితో భారత-చైనా మిత్ర మండలిలో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై, 1982లో చైనా పర్యటన చేసారు. ఈ పర్యాటన సమానతా సమాజం పట్ల ఆయన నిబద్ధతను మరింత పెంచింది.అరుదైన గౌరవం వైద్య వృత్తిని ఒక వ్యాపారంగా కాక, గొప్ప సేవా మార్గంగా పరిగణించిన డాక్టర్ బాలకృష్ణయ్య ప్రజా వైధ్యునిగా చరిత్ర పుటల్లో నిలిచిపొయారు. ఆయన వారసత్వానికి అత్యున్నత నివాళిగా, ఆయన కుటుంబ సభ్యులు మరియు వనపర్తి ప్రజల ఆకాంక్ష మేరకు, వనపర్తిలో నిర్మాణంలో ఉన్న 501 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి డాక్టర్ బాలకృష్ణయ్య పేరును పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షించదగిన విషయం. ఇది ఆ మహనీయుడికి అత్యున్నత నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలు భవిష్యత్ తరాలకు వైద్య సేవల్లో స్ఫూర్తిగా నిలవడానికి గుర్తుగా ఉంటుంది...