ధాన్యం కొనుగోలు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి.
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
వనపర్తి జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కొత్తకోట మండల పరిధిలోని పాలెం, కానాయిపల్లి గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్దేశించిన రిజిస్టర్లు నిర్వహిస్తున్నారా లేదా అని పరిశీలించారు. అదేవిధంగా కలెక్టర్ స్వయంగా తేమశాతాన్ని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చిన వెంటనే సీరియల్ నెంబర్ల వారీగా ఎంత దాన్యం తెచ్చారు, ధాన్యం తేమ తెచ్చిన రోజు ఎంత ఉంది అనే వివరాలు రిజిస్టర్లలో నమోదు చేసుకోవాలని తెలిపారు. నిర్దేశించిన తేమ శాతం వచ్చిన వెంటనే కేటాయించిన మిల్లుకు ధాన్యాన్ని వెంటనే లోడ్ చేసి పంపించేయాలని సూచించారు. ఇక వరి కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు సన్న రకం వరి ధాన్యాన్ని దొడ్డు రకం వరి ధాన్యాన్ని గుర్తించడంలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గతంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చిన శిక్షణ కార్యక్రమానికి హాజరైన వారు మాత్రమే కొనుగోళ్ళ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు.
*రైతు నేస్తం కార్యక్రమం*
సాగు రైతులకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు నేస్తం కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని కలెక్టర్ పేర్కొన్నారు. కొత్తకోట మండల పరిధిలోని పాలెం గ్రామంలో రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం వీడియో ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్థానిక రైతులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటలకు ఏర్పడే తెగుళ్ల నుంచి ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి నిపుణులు మెలకువలు తెలియజేయగా రైతులు వీక్షించారు.డి సి ఓ రాణి, డి సి ఎస్ ఓ కాశీ విశ్వనాథ్, డి ఎం జగన్, తహసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో వినీత్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.