మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేయాలి. అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్.
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
వనపర్తి జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా సంబంధిత శాఖల అధికారులు పనిచేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి నార్కోటిక్ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జిల్లాలో ఇప్పటి వరకు ఉన్న గంజాయి రవాణా, గంజాయి సాగు కేసులు, మాదక ద్రవ్యాలు వాడుతున్న వారి కేసులపై ఆరా తీయగా డిఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలు తెలిపారు. 2025 సంవత్సరంలో ఇప్పటివరకు ఎనిమిది కేసులు నమోదైనట్లు తెలిపారు.
స్పందించిన అదనపు కలెక్టర్ జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు ఉత్పత్తి చేయడం కానీ వినియోగించడం కానీ జరుగకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని సూచించారు. గంజాయి సాగు పై వ్యవసాయ విస్తర్ణాధికారుల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సాగును గుర్తించాల్సిన బాధ్యత ఏ.ఈ.ఒ ల పై ఉందన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో యాంటి డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వచ్చే అనర్థాల పై అవగాహన కల్పించాలన్నారు.
మాదక ద్రవ్యాలు వినియోగించే వారిపై, సరఫరా చేసే వారిపై, గంజాయి పండించే వారిపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇటీవల శిక్షణ పొందిన పోలీస్ శునకాల ద్వారా మాదక ద్రవ్యాలను గుర్తించేందుకు అనుమానం ఉన్న ప్రతి చోట తనిఖీలు చేయాలన్నారు. అదేవిధంగా జిల్లాలోని కల్లు దుకాణాలపై నిఘా ఉంచాలని, మైనర్లకు చిన్న పిల్లలకు కల్లు ఇవ్వకుండా దుకాణదారులకు సూచన చేయాలన్నారు. కల్లు లో అల్ట్రాజోలం అనే మత్తు పదార్థం వినియోగాన్ని కట్టడి చేయాలన్నారు. సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తే జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దగలమని సూచించారు.సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డిప్యూటీ కలెక్టర్లు శ్రావ్య, రంజిత్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.