*గత పాలకుల నిర్లక్ష్యం...అశ్రద్ధ నేడు పట్టణాన్ని ముంచేసింది : మాజీమంత్రి ప్రత్తిపాటి.* చిలకలూరిపేట నియోజకవర్గం
అక్షర విజేత
• పట్టణంలో పలుకాలనీలు నీటమునిగి ప్రజలు నిరాశ్రయులు కావడానికి కారణం గత ప్రభుత్వ వైఫల్యాలే.
• జిల్లా... నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంతగా 18 సెం.మీ వర్షపాతం నమోదైంది.
• రాష్ట్ర రైతాంగాన్ని కేంద్రం ఉదారంగా ఆదుకుంటేనే మరలా సాగు జరిగి.. వ్యవసాయం మనుగడ సాధిస్తుంది.
• పట్టణంలోని పలువార్డులు.. పసుమర్రు ఎస్టీ కాలనీలో పర్యటించి తుపాను సహాయ పునరావాస కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ తో కలిసి పర్యవేక్షించిన మాజీమంత్రి ప్రత్తిపాటి.
గత పాలకులు పట్టణ మరియు పరిసర గ్రామాల్లోని డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయకుండా, అవసరమైన చోట కొత్తగా కాలువల నిర్మాణం చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుతో నేడు మొంథా తుపాను తీవ్రతకు ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. బుధవారం ఆయన తుపాను తీవ్రత తగ్గాక పట్టణం మరియు పలు గామ్రాల్లో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తో కలిసి పర్యటించి, సహాయక చర్యలు పర్యవేక్షించారు. పసుమర్రు ఎస్టీ కాలనీ నీటమునగడంతో స్థానికుల్ని సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు తరలించి, భోజన..వసతి ఏర్పాట్లు చేయించారు. అనంతరం పట్టణంలోని డైక్ మెన్ కాలనీ (11వ వార్డు), 17వ, 28 వ వార్డు (శాంతినగర్), 29, 30, 38 వార్డుల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాల్లోని వారికి స్వచ్ఛమైన తాగునీరు, ఆహారం, దుప్పట్లు అందించాలని, ప్రభుత్వం అందించే ప్రతి సాయం వారికి అందేలా చూడాలని ప్రత్తిపాటి అధికారుల్ని ఆదేశించారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కాలువలు, ఇతర నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పునర్న్మించాలని స్పష్టంచేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
*18 సెం.మీ. వర్షపాతం నమోదైంది...గాలులకు విద్యుత్ తీగలు తెగి, సరఫరా నిలిచిపోయింది.*
జిల్లావ్యాప్తంగా.. మరియు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 18 సెం.మీ. వర్షపాతం నమోదైందని, గాలులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడ్డారని ప్రత్తిపాటి తెలిపారు. తుపాను తీరాన్ని తాకే సమయంలో గాలి తక్కువగా ఉండి వర్షం ఎక్కువగా కురిసిందని ప్రత్తిపాటి చెప్పారు. దానివల్ల పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయన్నారు. సంజీవనగర్, శాంతినగర్, వీరముష్టి కాలనీ, జాగుపాలెం, కొండ్రుపాడు, పోలిరెడ్డి పాలెం ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తిందన్నారు. భవిష్యత్ లో ఇటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు మరలా వరదనీరు జనావాసాల్లోకి రాకుండా డ్రైనేజ్ లను బలోపేతం చేయాలన్నారు. పట్టణ శివారు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపునీరు చేరిందని, దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామన్నారు.
*గత పాలకులు పట్టణాభివృద్ధిని నిర్లక్ష్యం చేసినందునే నేడు ముంపుప్రాంతాలు నీటమునిగాయి*
ఈ విధమైన పరిస్థితి భవిష్యత్ లో తలెత్తకుండా ఉండాలంటే పట్టణ డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించా లన్నారు. గత పాలకులు పట్టణాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, రోడ్లు.. డ్రైనేజ్ ల వంటి కనీస వసతుల్ని కూడా అశ్రద్ధ చేశారని, దాని ఫలితమే ఇప్పుడు ప్రజలకు అనుభవిస్తున్న కష్టాలని ప్రత్తిపాటి పేర్కొన్నారు. ఎంత వర్షం వచ్చినా మున్ముందు ఎక్కడా నీరు నిలవకుండా, పట్టణంలో కురిసిన వర్షపునీరు మొత్తం కుప్పగంజి, ఓగేరు వాగుల్లోకి చేరేలా ఇంజనీర్లను సంప్రదించి డ్రైనేజ్ వ్యవస్థను సమగ్రంగా పునరుద్ధరిస్తామని ప్రత్తిపాటి తెలిపారు. సమస్య తీవ్రతను ముఖ్యమంత్రికి తెలియచేసి, ప్రజల కష్టాలు వచ్చే వర్షాకాలం లోపు పరిష్కారమయ్యేలా చూస్తానని ఈ సందర్భంగా ప్రత్తిపాటి తెలిపారు.
*పత్తి పూర్తిగా దెబ్బతిన్నది.. వరి, మిర్చి సగానికి పైగా దెబ్బతిన్నాయి.. రైతులకు కోలుకోలేని నష్టం..*
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేంద్రం తక్షణమే రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని, భవిష్యత్ లో రైతులు మరలా సాగు చేపట్టాలంటే ఈ తుపానుకు దెబ్బతిన్న వారికి సంపూర్ణ న్యాయం చేయాలని ప్రత్తిపాటి కోరారు. అరకొర సబ్సిడీలు.. రాయితీలు కాకుండా పూర్తిస్థాయిలో రైతులకు సాయం అందించి కేంద్రమే ఆదుకోవాలని మాజీమంత్రి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, బీజేపీ నాయకులు శివనాగేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు బత్తినేని శ్రీనివాసరావు, ఇనగంటి జగదీష్, జాలాది సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి బాబు, ఎమ్మార్వో షేక్ మహమ్మద్ హుస్సేన్, డిఇ అబ్దుల్ రహీమ్, జనసేన పట్టణ అధ్యక్షులు మున్నీర్ హాసన్, బీజేపీ నాయకులు నెల్లూరి రంజిత్, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, కూటమి ముఖ్య నాయకులు, పాల్గొన్నారు.