*నిధుల కేటాయింపులో వివక్ష, అధికారుల నిర్లక్ష్యమే కారణం : కంటోన్మెంట్ వికాస్ మంచ్*
అక్షర విజేత, హైదరాబాద్ బ్యూరో:
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని
కంటోన్మెంట్ వికాస్ మంచ్ నేత సంకి రవి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేటాయింపులపై తక్షణ పునఃసమీక్ష చేయాలంటూ
కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. సుమారు 4.5 లక్షల జనాభా ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్కి
కేవలం 2.8 కోట్లు మాత్రమే కేటాయించడం ఎలా సమంజసమని ఆయన ప్రశ్నించారు. 50 వేల జనాభా ఉన్న చిన్న కంటోన్మెంట్లకు 6 నుండి 25 కోట్ల వరకు నిధులు కేటాయించిన
రక్షణ మంత్రిత్వ శాఖ సికింద్రాబాద్ కంటోన్మెంట్‌పై తీవ్ర అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు.
కేంద్రం వివక్ష చూపుతోందని, ప్రజల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తోందని వికాస్ మంచ్ నేతలు మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో ప్రత్యేక బోర్డు సమావేశం వెంటనే ఏర్పాటు చేసి,
కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి కనీసం 30 కోట్లు కేటాయించేలా ఒత్తిడి చేయాలని వారు డిమాండ్ చేశారు.
కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ ఛార్జీలు, పెండింగ్ నిధులపై లెక్కలు తేల్చి,
వాటిని వెంటనే విడుదల చేయాలని సూచించారు.
బోర్డు సీఈఓ మరియు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈసారి కేవలం 3 కోట్ల నిధులు మాత్రమే కేటాయించారని
సంకి రవి కుమార్ తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర నేతలు ముందుకు వచ్చి,
ప్రజల అభివృద్ధి కోసం, బోర్డు మౌళిక సదుపాయాల కల్పన కోసం
సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తూ,
ఈ అంశాన్ని ప్రజల ప్రయోజనార్థం కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా పరిగణించాలని కంటోన్మెంట్ వికాస్ మంచ్ స్పష్టం చేసింది.