మొంథా తీవ్రత దృష్ట్యా, ప్రజాజీవనానికి ఇబ్బందులు లేకుండా చూడండి : మాజీమంత్రి ప్రత్తిపాటి.
చిలకలూరపేట,అక్షరవిజేత :
• వ్యవసాయ, రెవెన్యూ, విద్యుత్, మున్సిపల్ విభాగాలు సమన్వయంతో పనిచేసి, నష్టనివారణ చర్యలు చేపట్టాలి.
• తుఫాను ధాటికి దెబ్బతిన్న పంటల నష్టపరిహారం సమగ్రంగా పూర్తిచేసి, రైతులకు వెంటనే సాయం అందేలా చూడాలి.
• అధికారులకు మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి దిశానిర్దేశం
“ ‘మొంథా’ వాయుగుండం తీవ్రత దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎదురయ్యే సమస్యల్ని ముందే గ్రహించి పరిష్కరించాలని, వ్యవసాయ, రెవెన్యూ, విద్యుత్ విభాగాల సమన్వయంతో పనిచేసి, ప్రజాజీవనానికి ఇబ్బంది లేకుండా చూడాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అధికారులకు సూచించారు. వాయుగుండం ప్రభావం దృష్ట్యా, అధికారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి.రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం అధికంగా ఉండే అవకాశాలున్నందున కూటమిప్రభుత్వం ఇప్పటికే సమగ్ర చర్యలు చేపట్టిందని, తుపాను ఎఫెక్ట్ అధికంగా ఉండే జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేకాధికారులను నియమించి, ఆర్టీజీఎస్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నియోజవకర్గంతో పాటు పల్నాడు జిల్లాపై తుపాను ప్రభావాన్ని అంచనా వేస్తూ, అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. లోతట్లు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి, భోజన.. వసతి ఏర్పాట్లు చేయాలని, ముందు జాగ్రత్తగా ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా మూసివేయాలని ఆయన సూచించారు. నియోజకవర్గంలోని వాగులు పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రమాదాలకు అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. తుపాను ధాటికి నేలకొరిగే ఉద్యాన, వాణిజ్య పంటల నష్టపరిహార అంచనాలపై వ్యవసాయ సిబ్బంది వేగంగా స్పందించాలని ప్రత్తిపాటి ఆదేశించారు. రైతులకు సకాలంలో ప్రభుత్వ పరిహారం అందిస్తే, వారికి మేలు కలుగుతుందన్నారు.విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, గాలికి నేలకొరికే అవకాశమున్న స్తంభాలను వెంటనే తొలగించి, కొత్తవి ఏర్పాటు చేయాలని, విద్యుత్ తీగలకు సమీపంగా ఉండే చెట్లను, కొమ్మలను తొలగించాలని ఆయన సూచించారు. పట్టణ శివారు ప్రాంతాల్లో నీరు నిలవకుండా, వర్షపు నీరు ఎప్పటికప్పుడు వెళ్లిపోయేలా మున్సిపల్ సిబ్బంది డ్రైనేజ్ లను శుభ్రం చేయాలన్నారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, తుఫాను తీవ్రత తగ్గి, వాతావరణం చక్కబడే వరకు ఇళ్లలోనే ఉండాలని ప్రత్తిపాటి సూచించారు.