భారత యువతను చిగురుటాకులా వణికిస్తున్న మత్తు ముప్పు
భారత యువతను చిగురుటాకులా వణికిస్తున్న మత్తు ముప్పు
(సి.హెచ్. ప్రతాప్)
భారతదేశం ప్రస్తుతం ఓ తీవ్ర సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశ యువత భారీగా మత్తు పదార్థాల ప్రభావానికి లోనవుతున్నారు. అభివృద్ధిపథంలో పరుగులు తీస్తున్న దేశం లోపలతనమే క్షీణించే స్థితిలో ఉంది. డ్రగ్స్ రూపంలో ఈ విఘాతం మౌనంగా సమాజాన్ని ముక్కలు చేస్తోంది.డ్రగ్స్ వినియోగం చాలా సందర్భాల్లో స్నేహితుల మధ్య సరదా ప్రయోగంగా మొదలవుతుంది. ఒక సందర్భంలో సరదాగా వాడిన మత్తు పదార్థం, కొన్నాళ్లలో దాని అవసరంగా మారుతుంది. ముఖ్యంగా ఒపియాయిడ్లు వంటివి, వైద్యుల సలహాతో తీసుకున్నప్పటికీ, ఎక్కువ మందికి అతి తక్కువ సమయంలో వ్యసన స్థితికి చేరుస్తున్నాయి. అలాగే ఇతరుల ప్రిస్క్రిప్షన్ ల ద్వారా తీసుకున్న మందుల ద్వారా కూడా శారీరక, మానసిక అవసరంగా మారుతుంది.యెయింస్ 2020 నివేదిక ప్రకారం, భారత్‌లో సుమారు 2.6 కోట్ల మందికి పైగా వ్యక్తులు మత్తు పదార్థాలకు బానిసలై ఉన్నారు, వీరిలో 77 లక్షల మంది ఓపియాయిడ్ వినియోగదారులు. ఇది ప్రపంచ స్థాయిలో అత్యధిక ఓపియాయిడ్ వినియోగం గల దేశాల్లో భారత్‌ను ఒకటిగా నిలిపింది. ఈ గణాంకాలు దారుణంగా ఆలోచింపజేస్తున్నాయి. భారతదేశ భౌగోళికత కూడా ఈ ముప్పును పెంచే వేదికగా మారింది. పశ్చిమాన గోల్డెన్ క్రెసెంట్ (అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్), తూర్పున గోల్డెన్ ట్రయాంగిల్ (మయన్మార్, థాయిలాండ్, లావోస్) మధ్యలో ఉన్న భారత్, డ్రగ్స్ అక్రమ రవాణాకు కీలక మార్గంగా మారింది. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ మాఫియా ముఠాలు దేశంలోకి మత్తు పదార్థాలను చొప్పిస్తున్నాయి.పట్టణాల నుంచి గ్రామాల వరకూ డ్రగ్స్ అందుబాటులోకి రావడం, మానసిక ఒత్తిడులు, మిత్రుల ప్రభావం, నిరాశ వంటి పరిస్థితుల్లో యువత వలలో పడిపోతున్నారు. దీని వల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, మానసిక రుగ్మతలు, హెపటైటిస్, ఎయిడ్స్ వంటి తీవ్రమైన వ్యాధులు పెరుగుతున్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. విద్యార్థులు చదువు మానేస్తున్నారు. నేరాలు, హింస, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.ఈ పాముకాటు లాంటి మత్తు ముప్పును నిర్మూలించేందుకు ప్రభుత్వం మరింత గట్టిగా అడుగులు వేయాలి. ఇప్పటికే అమలులో ఉన్న ఎన్ డి పి ఎస్ చట్టానికి మరింత బలమిచ్చి, డ్రగ్ డీలర్లపై కఠిన శిక్షలు విధించాలి. జీవిత ఖైదు లేదా మరణదండన వంటి శిక్షలను చట్టపరంగా సమీక్షించాలి. అంతేగాక, డ్రగ్స్ కేసులకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి, త్వరిత న్యాయం అందించాలి.అలాగే పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు, తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ, బాధితుల పునరావాస కేంద్రాలు, మానసిక చికిత్సలు వంటి అంశాలపై సమగ్ర చర్యలు తీసుకోవాలి.డ్రగ్స్ ఒక వ్యక్తిని మాత్రమే కాదు – ఒక తరం భవిష్యత్తును నాశనం చేస్తాయి. దేశ భద్రత, అభివృద్ధికి అవి పెద్ద అడ్డంకి. అందుకే ఈ సమస్యపై సమాజం మొత్తం మేల్కొని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో స్పందించాల్సిన అవసరం ఉంది. నేటి చర్యలే రేపటి రక్షణగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.