తెలంగాణలో ఘోరం..భర్తను గొడ్డలితో నరికి ఖతం చేసిన ఇద్దరు భార్యలు
అక్షరవిజేత, లింగాల ఘనపూర్:
తెలంగాణలో మరో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరి భార్యల చేతిలో ఓ భర్త అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలో జరిగింది. ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం ఏనబావి గ్రామ శివారు పిట్టలోనిగూడెంలో కాల్య కనకయ్య (30) నివాసం ఉంటున్నాడు.అతడు మద్యానికి బాగా బానిసయ్యాడు. తరచూ ఫుల్గా తాగొచ్చి ఇద్దరి భార్యలతో గొడవ పడుతుండేవాడు. రోజూ వారిని వేధించి.. మనస్సుకు ప్రశాంతత లేకుండా చేసేవాడు.ఇందులో భాగంగానే మే 18వ తేదీన ఫుల్గా తాగొచ్చి తన సొంత అక్కను మర్డర్ చేశాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కనకయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కనకయ్య అప్పుడప్పుడు గ్రామానికి వస్తూ.. ఇంట్లో భార్యలను, బయట గ్రామస్తులను బెదిరిస్తూ ఉండేవాడు.ఈ క్రమంలోనే సోమవారం రాత్రి మరోసారి ఇంటికి చేరుకుని భార్యను బెదిరించాడు. చేతిలో గొడ్డలి పట్టుకుని వారితో గొడవ పెట్టుకున్నాడు. ఇక అదే సమయంలో మనసు విసిగిపోయిన ఆ ఇద్దరు భార్యలు అతడిపై ఎదురుతిరిగి.. అదే గొడ్డలితో భర్తను హత్యచేశారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.