వెంకటేశ్వర స్వామి గుడికి రూ.9.97 కోట్ల కేటాయింపు ..ఎంపీ వినతి.. మంత్రి హామీ
వెంకటేశ్వర స్వామి గుడికి రూ.9.97 కోట్ల కేటాయింపు
..ఎంపీ వినతి.. మంత్రి హామీ
అక్షరవిజేత,స్టేషన్ ఘనపూర్ :
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయాభివృద్ధికి ఆర్థిక సహకారాన్ని అందించాలన్న ఎంపీ విజ్ఞప్తికి కేంద్రమంత్రి స్పందించి రూ 9.97 కోట్ల కేటాయింపుకు అంగీకరించడంతో రెండో తిరుపతి (శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ) దశ మారనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా వరంగల్ ఎంపీ కడియం కావ్య ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి, ఆలయాల పునరుద్ధరణ కోసం కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మర్యాద పూర్వకంగా కలిశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చారిత్రక ఆలయాలను అభివృద్ధి చేయాలంటూ కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ 'ప్రసాద్' పథకం కింద వరంగల్ ఆలయాల పునరుద్ధరణకు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చారిత్రక ఆలయాలు, కాకతీయ వారసత్వ సంపదను పునరుద్ధరించాలంటూ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కె ఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య తో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య బుధవారం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ఆలయాల అభివృద్ధిపై కేంద్ర మంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాలంటే ఆలయాల పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రికి ఎంపీ వివరించారు. ఆలయ పునరుద్ధరణతో స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు. ప్రధాన ఆలయాలకు కేటాయించాల్సిన నిధుల వివరాలను కూడా కేంద్ర మంత్రికి అందజేశారు. అందులో భాగంగా వరంగల్ వేయి స్తంభాల ఆలయంలోని కల్యాణ మండపం మరమ్మతులు, విగ్రహ ప్రతిష్టాపన, పార్కింగ్ మరియు శౌచాలయాల కోసం 75 కోట్లు. శ్రీ భద్రకాళి ఆలయంలోని మహా మండపం పునర్నిర్మాణం, పర్యాటక సదుపాయాల కోసం 100 కోట్లు. చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వరస్వామి ఆలయం (తెలంగాణ తిరుపతి) లో భక్తుల వసతి గదులు, కొండపైకి రవాణా మార్గం కోసం రూ. 9.97 కోట్లు. దీంతో తెలంగాణ తిరుపతి, రెండో తిరుపతిగా పిలవబడే శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయం వృద్ధి చెంది భక్తులకు మరిన్ని సేవలు అందే అవకాశం ఉందని, నిధుల కేటాయింపుకు కృషిచేసిన వరంగల్ ఎంపీ కడియం కావ్య కు ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. భూపాలపల్లి జిల్లాలోని నపాక ఆలయం, కోటగుళ్లు, రెడ్డి గుడి ప్రత్యేక శిలలపై నిర్మితమైన ఆలయాల పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని కోరారు. అలాగే వరంగల్ కోటలో ఉన్న 14 ఆలయాలకు పునరుద్ధరణ పనులకు విధులు కేటాయించాలని ఎంపీ కేంద్రమంత్రి కోరారు. మొత్తం 185 కోట్లతో ఆలయాల పునరుద్ధరణ పనులు చేపడితే వరంగల్ నగరం ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ద పడుతుందని తెలియజేశారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వరంగల్ ప్రాచీన ఆలయాలను ప్రసాద్ పథకం లో చేర్చనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ మేరకు వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.