ఆరోగ్యకర జీవనం.. 'యోగ'తో సౌభాగ్యం! – ప్రజావగాహనకే అంతర్జాతీయ యోగా దినోత్సవం.. -- 'వ్యాయామవిద్య'కూ ఇదే ఊపు రావాలి!
ఆరోగ్యకర జీవనం.. 'యోగ'తో సౌభాగ్యం!
– ప్రజావగాహనకే అంతర్జాతీయ యోగా దినోత్సవం..
-- 'వ్యాయామవిద్య'కూ ఇదే ఊపు రావాలి!
(నిమ్మరాజు చలపతిరావు)
అక్షరవిజేత,గుంటూరు, జూన్ 20:
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా లక్ష ప్రదేశాల్లో ప్రజలు సామూహికంగా యోగాసనాలు వేసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. యోగా పట్ల అత్యంత ఆసక్తి కలిగిన ప్రధాని నరేంద్ర మోడీకి నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబు తిరిగి చేరువకావటం కూడా దీనికి కారణం కావచ్చు. ‘సంపూర్ణ ఆరోగ్యానికి ఖర్చులేని మందు.. మానసిక వికాస సిద్ధి.. శరీరం - మనసు మధ్య సమతుల్య సాధనకు సహాయపడేది యోగా ఒక్కటే' అనే నినాదం మార్మోగుతోంది. 21న కనీసం 2 కోట్ల మంది యోగాసనాల్లో పాల్గొనేలా చూడాలని భావిస్తే, ఇప్పటికే ఆ అంచనాలు దాటాయి. తొలుత 3000 మందికి మాస్టర్ ట్రైనర్ శిక్షణ ఇచ్చి, వారిద్వారా ఒక లక్షా 25 వేల మంది శిక్షకులను తయారుచేశారు.
ఇక విశాఖపట్నంలో యోగా ప్రధాన వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. యోగాసనాల ప్రదర్శనను తిలకించేవారిని సైతం భారీ సంఖ్యలో సమీకరిస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఈ కార్యక్రమ కన్వీనర్ గా నిరంతర పర్యవేక్షణలో వున్నారు. రాష్ట్ర మంత్రులు వై.సత్యకుమార్, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, ఆప్రాంత మంత్రులు కూడా విశాఖలో బసచేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
నేడు యోగా పట్ల ప్రజల్లో ఆసక్తి పెంచడానికి ఎన్నెన్నో కష్టాలు పడాల్సి వస్తోందంటే.. పాఠశాల, ఆపై కళాశాలల్లో వ్యాయామ విద్య అమలుపై పాలకులు వహించిన నేరపూరిత నిర్లక్ష్యమే అందుకు కారణం. విద్యాలయాల్లో గతంలో ప్రతిరోజూ ఒక పీరియడ్ ‘డ్రిల్ క్లాసు’ కోసం కేటాయించేవారు. తొలుత పరుగుతో పాటు ఆపై అనేక క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి పిఈటి, ఎంపిఇడి, బిపిఇడి టీచర్లు, అధ్యాపకులు వుండేవారు. ఆపై వేలాది మంది శిక్షకులు విద్యార్థులకు క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేవారు. విద్యాలయాల్లో రానురాను వీరి నియామకాలు నిలిచిపోవడంతో, ఏకంగా పలు క్రీడాంశాలే మటుమాయమయ్యాయి.
గతంలో ప్రతి ఏటా జోన్, సెంట్రల్ జోన్, జిల్లా, రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడాపోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇవి వారిలో పోటీతత్వాన్ని పెంపొందించేవి. ప్రస్తుతం జిల్లా స్థాయిలో మొక్కుబడిగా క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. వీటిలోనూ అనేక విద్యాలయాలకు కనీసం ప్రాతినిధ్యం కూడా లభించడం లేదు. నేడు అనేక పాఠశాలలు, కళాశాలల్లో క్రీడాపరికరాలు సైతం మచ్చుకైనా కనిపించడం లేదు. ఇక విద్యాలయాల్లో వ్యాయామ విద్యకు చోటెక్కడున్నట్టు? అలాగే, ప్రభుత్వ గుర్తింపు పొందిన వేలాది పాఠశాలలు జానెడు ఖాళీ స్థలానికి కూడా నోచుకోని అపార్ట్మెంట్లలో నడుస్తున్నాయి. కచ్చితంగా ఆటస్థలం వుండాలనే విద్యాశాఖ నిబంధనలున్నా, ఫలితం మాత్రం శూన్యం!
యోగా, వ్యాయామ విద్యల మధ్య పెద్దగా తేడాలేమీ లేవు. రెండిటిలోనూ శారీరక భంగిమలు 70 శాతం సమానం. వ్యాయామంలో తొలుత రన్నింగ్ వుంటే, యోగాలో మెడిటేషన్ వుంటుంది. రన్నింగ్ తర్వాత యోగా చేస్తే సత్ఫలితాలు వుంటాయని నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే, ఆధునిక కాలానుగుణంగా వ్యాయామ విద్యలో అవసరమైన మార్పు-చేర్పులు చేసి, ఉన్నత పాఠశాలల్లోని ప్రతి విద్యార్థి విధిగా నిత్యం ‘స్పోర్ట్స్ పీరియడ్’లో పాల్గొనేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోగలిగితే.. యోగా ఈ రాష్ట్రంలో ఉన్నత స్థాయికి చేరుకుంటుందని చెప్పడంలో సందేహించాల్సింది లేదు.
వ్యాయామ విద్యపై ఇప్పటికే పాలకులు శ్రద్ధ వహించి వుంటే.. యోగాపై అవగాహన కోసం నేడు ఒక్కసారిగా కోట్లాది రూపాయల ప్రజాధనం వ్యయం చేయటం, ఆపై హైరానా పడాల్సిన అగత్యం దాపురించేది కాదని పలువురు సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు, అధ్యాపకులు వ్యాఖ్యానిస్తున్నారు.